Advertisement

  • ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ విజయం...రష్యాతో సంయుక్తంగా స్వర్ణపతకం

ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ విజయం...రష్యాతో సంయుక్తంగా స్వర్ణపతకం

By: chandrasekar Mon, 31 Aug 2020 7:24 PM

ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ విజయం...రష్యాతో సంయుక్తంగా స్వర్ణపతకం


చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్‌గా నిలిచి౦ది భారత్. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు వెళ్లింది. ఉత్కంఠ౦గా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, రష్యాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్లు ఫిడె ప్రకటించింది. మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కు చేరుకుని సంయుక్త విజేతలుగా నిలిచిన రష్యా, భారత్‌ జట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ తెలిపారు. ఇంతకుముందు శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో హంపి బృందం పోలండ్ జట్టుపై కీలక విజయం సాధించడంతో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్ తొలుత టై అయినప్పటికీ టై బ్రేక్ గేమ్(ఆర్మగెడాన్)లో హంపి ఇంకా 48 సెకన్ల సమయం ఉండగానే విజయం సాధించడంతో భారత్ ఫైనల్ చేరింది. 1927లో అధికారిక చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభం అయినప్పటి నుంచి భారత్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

శనివారం జరిగిన సెమీఫైనల్‌లో భారత్ తొలి రౌండ్లో 2-4తో ఓడినా రెండో రౌండ్లో 4.5-1.5తో గెలిచి పోటీలో నిలిచింది. విజేతను నిర్ణయించే ఆర్మగెడాన్‌ మ్యాచ్‌లో హంపి ప్రత్యర్థిని చిత్తు చేయడంతో భారత్‌ ముందంజ వేసింది. తొలి రౌండ్‌ మొదటి పోరులో డుడా చేతిలో ఆనంద్ ఆ తర్వాత వొటాజెక్‌ చేతిలో విదిత్‌ గుజరాతి పరాజయం పాలవడంతో భారత్ 0-2తో వెనుకబడింది.

కానీ సొకోతో హంపి డ్రా చేసుకోవడంతో పాటు జానిక్‌పై నిహాల్‌ సరీన్‌ గెలవడంతో భారత్‌ మళ్లీ పుంజుకొన్నప్పటికీ స్లివికా చేతిలో దివ్య ఓడడం, సిఫ్కాతో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకోవడంతో తొలి రౌండ్‌ చేజారింది. రెండో రౌండ్లో డుడాపై ఆనంద్‌ విజయం సాధించగా సిఫ్కాను హారిక ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం దక్కింది.ఆ తర్వాత జనిక్‌ చేతిలో ప్రజ్ఞానంద ఓడినా.. సోకోపై హంపి గెలిచారు. సిల్వికాతో గేమ్‌ను అవంతిక అగర్వాల్‌ డ్రా చేసుకోగా గాజెస్కీపై విదిత్‌ గెలవడంతో ఈ రౌండ్‌ను భారత్‌ 4.5-1.5తో గెలిచింది. ఫలితాన్ని తేల్చే ఆర్మగెడాన్‌ (టైబ్రేక్‌)లో నల్లపావులతో ఆడుతూ హంపి సోకోపై గెలిచి భారత్‌ను ఫైనల్‌ చేర్చింది. కరోనా నేపథ్యంలో తొలిసారి చెస్‌ ఒలింపియాడ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

ఆర్మగెడాన్‌ లో కోనేరు హంపినే దించడానికి కారణం ఉంది. టైబ్రేక్‌ ఎవరు ఆడాలనేది టాస్‌‌పై ఆధారపడి ఉంటుంది. ప్రతి జట్టులో పురుషులు, మహిళలు, జూనియర్‌ బాలురు, జూనియర్‌ బాలికల కేటగిరీలు ఉంటాయి. పోలెండ్‌తో సెమీస్‌ ఆర్మగెడాన్‌కు దారి తీసినప్పుడు టాస్‌ వేయగా మహిళలకు ఆడే అవకాశం వచ్చింది. ఈ పరిస్థితి వస్తే హంపినే బరిలో దింపాలని ముందుగా అనుకోవడంతో ఆమె టైబ్రేక్‌ ఆడింది. టైబ్రేక్‌ మ్యాచ్‌కు ముందు కూడా టాస్‌ వేసి ఎవరు ఏ రంగు పావులతో ఆడాలో నిర్ణయిస్తారు. టాస్‌ గెలిచిన హంపి నల్ల పావులను ఎంచుకుంది. సాధారణంగా ఆర్మగెడాన్‌లో తెల్ల పావులతో ఆడేవాళ్లకు 5 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వాళ్లకు 4 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడిన వాళ్లు కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడేవాళ్లు డ్రా చేసుకున్నా చాలు. ఆర్మగెడాన్‌లో హంపి మరో 48 సెకన్లు ఉండగానే విజయాన్ని సాధించింది.

Tags :
|

Advertisement