Advertisement

  • జూమ్ యాప్ ను కూడా నిషేధించాలి ..పలువురి డిమాండ్

జూమ్ యాప్ ను కూడా నిషేధించాలి ..పలువురి డిమాండ్

By: Sankar Tue, 30 June 2020 6:51 PM

జూమ్ యాప్ ను కూడా నిషేధించాలి ..పలువురి డిమాండ్



భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌, హెల్‌, షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి పలు పాపులర్‌ యాప్‌లను నిషేధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

గల్వాన్‌ లోయలో ఘాతుకానికి పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌కు బాగా బుద్ధి చెప్పారని కొంతమంది కేంద్రాన్ని ప్రశంసిస్తుండగా... మరికొంత మంది కేవలం చైనా యాప్‌లను నిషేధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పెదవి విరుస్తున్నారు. ప్రజల గోప్యత హక్కును పరిరక్షించాలంటే వీడియో కాలింగ్‌ యాప్‌ జూమ్‌ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది జూమ్‌ను చైనీస్‌ యాప్‌గా పేర్కొంటున్నారు. ​నిజానికి ‘జూమ్‌’ అమెరికా కేంద్రంగా పనిచేసే జూమ్‌ వీడియో కమ్యూనికేషన్స్‌ కంపెనీకి చెందినది. అమెరికా పౌరసత్వం కలిగిన చైనీస్‌- అమెరికన్‌ ఎరిక్‌ యువాన్‌ దీనిని స్థాపించారు. ఈ యాప్‌ను లాంచ్‌ చేసే సమయంలో ఇది అమెరికన్‌ యాపేనంటూ ఆయన ప్రకటన చేశారు.

కాగా చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో జూమ్‌ యాప్‌ పేరును కూడా వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వ స‌మావేశాలకు ఈ యాప్‌ని వినియోగించ‌రాదంటూ కేంద్రం స్ప‌ష్టం చేసిన విషయం విదితమే. అంతేకాదు జ‌ర్మనీలోనూ ఈ యాప్‌పై ఆంక్షలు విధించ‌గా.. తైవాన్‌లో పూర్తిస్థాయిలో దీనిని నిషేధించడంతో జూమ్‌ భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జూమ్‌ విశ్వసనీయతపై చర్చ లేవనెత్తిన వాళ్లు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement