Advertisement

  • సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

By: chandrasekar Wed, 08 July 2020 5:59 PM

సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు


జిల్లాలో కరోనా కేసులు 25 నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మోజీ రాం రాథోడ్‌ తెలిపారు. మంగళవారం ఒక్క రోజే జిల్లాలో 22 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారని వెల్లడించారు. జిల్లాలో సదాశివపేట 7, బొల్లారం 1, అమీన్‌పూర్‌ 5, భానూర్‌ 3, జహీరాబాద్‌ 2, బీరంగూడ 2, తెల్లాపూర్‌ 2, పటాన్‌చెరు 1, కంది మండలం ఎర్ధనూర్‌ గ్రామం ఇప్పలగడ్డ తండా 1 మొత్తం 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని సదాశివపేటలో మహిళ మృతి చెందగా, ఆర్‌సీపురంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.

మండలంలోని సుల్తానాబాద్‌ గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు గ్రామంలో చర్యలు చేపట్టారు. ఈ మేరకు వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌రెడ్డి తమ సిబ్బందితో ఇంటింటికీ పర్యవేక్షించి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. వైద్యుడు స్థానికంగా ఎవరెవరిని కలిసిన పూర్తి వివరాలను సేకరించి వైద్య పరీక్షలు చేశారు. సుల్తానాబాద్‌లో 5 మంది, గోసాయిపల్లిలో 10మందిని గుర్తించామని, మరికొంతమందికి నేడు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పటణంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ‘గడా’ వైద్యాధికారి కాశీనాథ్‌ తెలిపారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు (60) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రెండు రోజుల కింద కండ్లు తిరిగి కిందపడిపోవడంతో బంధువులు ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించినట్లు తెలిపారు. దవాఖానలో వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌ అని తేలింది . చేర్యాల సీహెచ్‌సీలోని పీపీపీ యూనిట్‌ విభాగం హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి, సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది వృద్ధురాలి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారు.

రామాయంపేట మున్సిపల్‌లో కరోనా కేసులు ఆరుకు చేరాయి. పురపాలిక పరిధిలోని గొల్పర్తి గ్రామానికి చెందిన మహిళ (60) అనారోగ్యానికి గురికావడంతో కుటుంబీకులు మూడురోజుల కింద ఉస్మానియా దవాఖానకు తరలించారు. వైద్యులు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. సదరు మహిళ పట్టణంలోని ఓ ఇంట్లో పనులు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వైద్య సిబ్బంది ఇంటి సభ్యులతోపాటు బాధిత మహిళ కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

తూప్రాన్‌లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావన తెలిపారు. పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ (42) దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండగా ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. మందులు వేసుకున్నప్పటికీ నయం కాకపోవడంతో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా న్యూమోనియా ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న ఎర్రగడ్డలోని ఛాతి దవాఖానలో రక్తనమూనా పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

మండలంలోని నార్లపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2 రోజుల కింద కరోనా పాజిటివ్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులకు తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన హోం క్వారంటైన్‌ కేంద్రాన్ని డాక్టర్‌ ఎలిజిబెత్‌రాణి సందర్శించారు.

Tags :
|
|

Advertisement