Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లే....

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లే....

By: chandrasekar Tue, 11 Aug 2020 6:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లే....


ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఆగస్టు 16న జరగట్లేదని తెలిసింది. ఇందుకు కోర్టు కేసులు, ప్రధానికి ఆహ్వానం పంపే అంశం ఆలస్యం అయ్యేలా ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఇలాగే భూమిపూజ చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని ఆనుకుంటోంది. ఇందుకోసం మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ప్రధానమంత్రికి రావడం కుదరకపోతే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా ఇందులో పాల్గొనాలని అడగబోతున్నారు.

కానీ ఇప్పటి వరకూ అపాయింట్‌మెంట్ దొరకలేదు. టైమ్ చూస్తే దగ్గర పడింది. ఇంత తక్కువ టైమ్‌లో ఇవన్నీ కుదిరేలా కనిపించట్లేదు పైగా... హైకోర్టేమో మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో విధించింది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నా అది నాల్రోజులో తేలుతుందా అన్నది డౌటుగా ఉండటంతో... ఈ నెల 16న శంకుస్థాపన ఉండడం లేదని తెలిసింది. 16 తరువాత 2 నెలలపాటూ సరైన ముహూర్తాలు లేనందున అదే తేదీని ఫిక్స్ చేయాలని బలంగా అనుకుంది ప్రభుత్వం. అదే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.20 వేల కోట్లతో 62 వేల ఎకరాలు సేకరించింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాక వారికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ/పట్టణ) కింద 2022 నాటికి ఇళ్లు నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన. కానీ తరువాత సరైన ముహూర్తాలు లేనందున ఇక దసరా తర్వాతే శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.

ప్రభుత్వ ప్లాన్‌కి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో సమస్యగా మారుతోంది. CRDA, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై ఈ మధ్యే గవర్నర్ విశ్వభూషణ్ సంతకం చేశారు. వెంటనే అమరావతి రైతులు ఆ బిల్లుల అమలుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు CRDA, పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలంది. అలాగే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గత టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టింది? మరి ఆ డబ్బు ప్రజలది కాబట్టి దాన్ని వృథా అవ్వకుండా ఏం చేస్తున్నారు? అసలు ఎంత ఖర్చైందో వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్ట్ 16న శంకుస్థాపన సాధ్యం కాదనుకుంటున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. CRDA, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు జారీచేసిన స్టేటస్ కో ఆర్డర్‌పై స్టే ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్‌ను పక్కన పెట్టినా హడావుడిగా శంకుస్థాపన చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

Tags :

Advertisement