Advertisement

  • హెలికాప్టర్ షాట్ లో ఆకట్టుకోదగ్గ యువ క్రికెటర్ రిషబ్ పంత్

హెలికాప్టర్ షాట్ లో ఆకట్టుకోదగ్గ యువ క్రికెటర్ రిషబ్ పంత్

By: chandrasekar Thu, 30 July 2020 6:50 PM

హెలికాప్టర్ షాట్ లో ఆకట్టుకోదగ్గ యువ క్రికెటర్ రిషబ్ పంత్


హెలికాప్టర్ షాట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మహేంద్రసింగ్ ధోనీ. దశాబ్దన్నర క్రితం ఈ హెలికాప్టర్ షాట్‌ని క్రికెట్ ప్రపంచానికి ధోనీ పరిచయం చేయగా పదుల సంఖ్యలో క్రికెటర్లు అతడ్ని అనుకరించే ప్రయత్నం చేశారు. కానీ ఓ 4-5 మంది క్రికెటర్లు మాత్రమే ధోనీ తరహాలో ఆ షాట్‌ని ఆడగలిగారు. వారిలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉండగా అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్ రెగ్యులర్‌గా హెలికాప్టర్ షాట్‌ ఆడుతుంటారు.

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటుండగా గత కొద్దిరోజుల నుంచి నెట్స్‌లో వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సురేశ్ రైనాతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన రిషబ్ పంత్ తాజాగా గుర్‌గ్రామ్‌లో అవుట్‌ డోర్‌లో ప్రాక్టీస్ మొదలెట్టాడు. సెషన్‌లో భాగంగా స్పిన్నర్ విసిరిన బంతిని హెలికాప్టర్ షాట్ రూపంలో పంత్ సిక్స్‌గా తరలించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

భారత్ జట్టులోకి 2017లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ జూనియర్ ధోనీ‌గా అందరి నుంచి కితాబులు అందుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా ఈ ఏడాది జనవరి వరకూ అతని స్థానంలో రిషబ్ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. కానీ వన్డే, టీ20ల్లో ఘోరంగా విఫలమైన పంత్ తన స్థానాన్ని కేఎల్ రాహుల్‌కి చేజార్చుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ రేసులోకి రావాలని పంత్ ఆశిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరగనుంది.

Tags :

Advertisement