Advertisement

  • అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్

By: Dimple Thu, 27 Aug 2020 09:25 AM

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్

సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మరో 8 మంది గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వివరాలు సమర్పించాలని గనుల శాఖకు హైకోర్టు స్పష్టంచేసింది. వ్యాజ్య విచారణార్హతపై వివరాలివ్వాలని గనులు, హోంశాఖలను ఆదేశించింది. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరుజిల్లా మండలం కోటనెమలిపురి, కుబాదుపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు 8 మంది అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆ గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు పప్పుల శ్రీనివాసరెడ్డి, నల్లగొర్ల రామయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.
బుధవారం విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది నాగరఘు వాదనలు వినిపిస్తూ.. ముగ్గురాయి గనుల అక్రమ తవ్వకంపై మైనింగ్‌ అధికారులకు వినతిపత్రం సమర్పించగా విచారణ జరిపి వాస్తవమేనని తేల్చారన్నారు. బాధ్యులపై చర్యలు లేవని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ ‘ఇది ప్రజాహిత వ్యాజ్యం ఎలా అవుతుంది? మీ అఫిడవిట్లోనే మీరు వైకాపాలో చురుకైన సభ్యులు అన్నారు. రాజకీయ ప్రతీకారాన్ని పిల్‌ ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నారా? ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఎలా ఉంటుంది’ అని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ.. పదిహేనో ప్రతివాది (ఎమ్మెల్యే రాంబాబు) గత కొంతకాలంగా గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. మిగిలినవారు సైతం స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు సన్నిహితులన్నారు. ప్రభుత్వ ఆస్తిని రక్షించాలన్న సదుద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశామన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ప్రజాచైతన్యం కలిగిన వ్యక్తినని చెబితే సరిపోదు. వ్యాజ్య విచారణార్హతపై మేం సంతృప్తి చెందడం లేదు. సంతృప్తి చెందితేనే విచారణకు ఆదేశిస్తాం’ అని తెలిపింది. విచారణార్హతపై స్పందన తెలపాలని గనులు, హోం శాఖలను ఆదేశించింది. ఒక పార్టీ కార్యకర్త..అదే పార్టీవ్యక్తిపై పిల్‌ దాఖలు చేయొచ్చా? దీనిపై సుప్రీంకోర్టు తీర్పులేమైనా ఉన్నాయా? తదితర వివరాల్ని తమ ముందుంచాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌పై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.

Tags :

Advertisement