Advertisement

అగ్రగామి విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్‌

By: Sankar Thu, 11 June 2020 9:52 PM

అగ్రగామి విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్‌

2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఆర్‌డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్‌–2020ను ఆ శాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు.

ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఐఐటీ–మద్రాస్‌ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్‌ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్‌ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్‌ నల్సార్‌ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్‌ నైపర్‌ ఐదో స్థానంలో నిలిచింది.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్‌ అండ్‌ రీసోర్సెస్‌(టీఎల్‌ఆర్‌), రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌(ఆర్‌పీ), గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్‌(జీవో), ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్‌(పీఆర్‌) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్‌ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి.

అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్‌ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్‌ ర్యాంకులు, ఇంజినీరింగ్‌ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్‌మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు.

Tags :
|

Advertisement