Advertisement

  • మానసిక ధైర్యం, శారీరక దృఢత్వంతో కరోనాను జయించగలిగాను: వెంకయ్య నాయుడు

మానసిక ధైర్యం, శారీరక దృఢత్వంతో కరోనాను జయించగలిగాను: వెంకయ్య నాయుడు

By: chandrasekar Wed, 14 Oct 2020 2:06 PM

మానసిక ధైర్యం, శారీరక దృఢత్వంతో కరోనాను జయించగలిగాను: వెంకయ్య నాయుడు


న్యూఢిల్లీ: కరోనాను జయించడంలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, సంప్రదాయ ఆహారం నాకు సహాయపడ్డాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. అక్టోబర్ 12న ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ ఫలితం రావడం, కరోనా నుంచి కోలుకోవడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తెలిసిన నాటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నానని, వైద్యుల సూచనల మేరకు వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు పాటించాను. అదే విధంగా గతంలో కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిన నా వ్యక్తిగత సిబ్బంది సహా 13 మంది ఉపరాష్ట్రపతి సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిగా కోలుకున్నారని తెలిసి ఎంతో సంతోషించానని తెలిపారు.

నాకు వయసుతో పాటు మధుమేహం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, నడక, యోగ వంటి సాధారణ శారీరక వ్యాయామంతో పాటు దేశీయ ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల కరోనా నుంచి కోలుకోగలిగానని వెంకయ్యనాయుడు చెప్పారు. నా స్వీయ అనుభవం, దృఢమైన నమ్మకం ఆధారంగా ప్రతిరోజూ కొంత సేపు నడక, జాగింగ్, యోగా లాంటి శారీక వ్యాయామాన్ని చేయాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నాను. అదే విధంగా పోషకాహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యమని సూచించారు.

అలాగే కరోనా వైరస్‌ నుంచి రక్షణ విషయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకుండా అన్నివేళలా మాస్క్‌లను ధరించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలన్నారు. స్వీయ నిర్బంధ సమయంలో కరోనా మహమ్మారి సహా వివిధ సమస్యలపై వార్తాపత్రికలు, ఇతర మాగజైన్‌లలో కథనాలు, ఆసక్తికరమైన వివిధ అంశాల మీద ప్రముఖులు రచించిన పుస్తకాలు చదవడం ద్వారా సమయాన్ని చక్కగా గడపగలిగాను అని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఇంటర్నెట్‌ ద్వారా బహిరంగ కార్యక్రమాలకు మరికొంత కాలం హాజరు కాలేను అని. వారం, పదిరోజులపాటు ఇంటి నుంచే పని చేయాలని నిశ్చయించుకున్నానని పేర్కొన్నారు. విజయదశమి తర్వాత ప్రజాసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు.

Tags :

Advertisement