Advertisement

  • సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే డ్రగ్స్‌ తీసుకున్నాను

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే డ్రగ్స్‌ తీసుకున్నాను

By: chandrasekar Mon, 14 Sept 2020 4:50 PM

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే డ్రగ్స్‌ తీసుకున్నాను


యుక్తవయస్సులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే డ్రగ్స్‌ తీసుకున్నానంటూ కంగన మార్చి నెలలో చేసిన వీడియో తాజాగా వైరల్‌ అయింది. మనాలీలోని తన స్వగృహం నుంచి కంగన ఆ వీడియోను రికార్డ్‌ చేశారు. ‘‘నేను ఇంటి నుంచి పారిపోయి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టిన రెండేళ్లకు ఫిల్మ్‌ స్టార్‌ కాగలిగాను. దాంతో పాటే డ్రగ్స్‌కూ బానిస అయ్యాను. ఆ అలవాటున్న వ్యక్తుల చేతుల్లో యుక్తవయసులో నేను చిక్కాను’’ అని ఆ వీడియోలో ఆమె చెప్పారు. అయితే.. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నట్లు తేలితే ముంబై వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమని కంగన తాజాగా సవాలు చేసిన సంగతి తెలిసిందే.

హిందీ చిత్ర పరిశ్రమలో 99 శాతం మంది డ్రగ్స్‌ వాడతారని కంగన ఆరోపిస్తున్నారు. కాగా, కంగనకు బీజేపీ మద్దతివ్వడం దురదృష్టకరమంటూ సంజయ్‌ రౌత్‌ సామ్నా పత్రికలో చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె ట్విటర్‌లో మండిపడ్డారు. ‘‘వావ్‌..! డ్రగ్స్‌, మాఫియా దందాలను బయటపెట్టిన వ్యక్తికి బీజేపీ మద్దతునివ్వడం దురదృష్టకరం. దాని బదులు శివసేన గూండాలతో నాపై దాడి, అత్యాచారాల్ని బీజేపీ చేయనివ్వాల్సింది. అంతేకదా సంజయ్‌ జీ? మాఫియాకు ఎదురు నిలిచిన ఒక మహిళకు రక్షణ కల్పిస్తుందా బీజేపీ? ఎంత ధైర్యం?’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు.. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియార్‌తో కంగన ఆదివారం కలిశారు.

కాగా సుశాంత్‌ ఫామ్‌ హౌస్‌లో అతడి స్నేహితులు, బాలీవుడ్‌ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకునేవారని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణలో రియా చక్రవర్తి వెల్లడించినట్లు సమాచారం. ఒక సినీ ప్రముఖుడు అతడికి డ్రగ్స్‌ అలవాటు చేశాడని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితర ప్రముఖుల పేర్లను ఎన్‌సీబీ విచారణలో రియా వెల్లడించిందన్న వార్తలను ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా కొట్టిపారేశారు. ‘‘మేము ఎవరి పేర్లపైనా తుది నిర్ణయానికి రాలేదు. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి జాబితా అనేదేదీ మేము తయారుచేయలేదు. కేవలం డ్రగ్‌ డీలర్లు, సరఫరాదారుల జాబితా మాత్రమే సిద్ధం చేశాం. దాన్నే బాలీవుడ్‌ జాబితాగా అందరూ పొరబడుతున్నారు’’ అని వివరించారు. కాగా ఈడీ అధికారులు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి దర్యాప్తు జరపడానికి రంగంలోకి దిగారు.

Tags :
|
|

Advertisement