Advertisement

పల్లె బాట పట్టిన మహా నగర ప్రజలు

By: Sankar Thu, 02 July 2020 10:09 AM

పల్లె బాట పట్టిన మహా నగర ప్రజలు



తెలంగాణాలో , ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో మళ్ళీ హైద్రాబాద్లో లాక్డౌన్ పెడ్తారు అని ప్రచారం జరగడంతో.. హైదరాబాద్లో ఉన్న అనేక అంది వాళ్ళ సొంత ఊర్ల బాట పట్టారు ..చాలామంది ఇళ్లు ఖాళీచేసి, సామాను సర్దుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు లాక్‌డౌన్‌ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వెళ్తున్నారు.తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకొందరు ఊళ్లకు బయల్దేరుతున్నారు.

దీంతో రెండ్రోజులుగా హైదరాబాద్‌ నలువైపులా రహదార్లపై రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. విజయవాడ హైవేతో పాటు వరంగల్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, చేవెళ్ల తదితర మార్గాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్‌ – విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి రెండ్రోజులుగా రద్దీగా మారింది.యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. వాహనాలు ఎక్కువ వస్తుండడం, నగదు మార్గంలో బారులు తీరుతుండడంతో టోల్‌ సిబ్బంది వాహనదారుల వద్దకే వెళ్లి హ్యాండ్‌మిషన్‌ ద్వారా టోల్‌ రుసుము తీసుకుంటున్నారు.

మరోవైపు మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తల నేపథ్యంలో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద జనం నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరుతున్నారు. లాక్‌డౌన్‌ కాలానికి సరిపడా సరుకులు కొని పెట్టుకోవాలనే ఆత్రుతతో దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. వైన్‌షాపుల వద్దా రద్దీ కనిపిస్తోంది.

మరోపక్క సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఇతర బీదాబిక్కీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.హైదరాబాద్‌లో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాల్లేక కష్టపడ్డారు. సొంత వాహనాలున్న వారు అనుమతులు లభించక వెళ్లలేకపోయారు. అప్పటి అనుభవాలతో ఇప్పుడు ముందుజాగ్రత్తగా పల్లెలకు తరలివెళ్తున్నారు. నగరంలోని దాదాపు ప్రతి బస్తీ, కాలనీ నుంచి పల్లెబాట కొనసాగుతోంది.

Tags :
|
|
|

Advertisement