Advertisement

  • హైదరాబాద్ లో మళ్ళీ మెట్రో సేవలు నేటి నుంచే ప్రారంభం..

హైదరాబాద్ లో మళ్ళీ మెట్రో సేవలు నేటి నుంచే ప్రారంభం..

By: Sankar Mon, 07 Sept 2020 08:44 AM

హైదరాబాద్ లో మళ్ళీ మెట్రో సేవలు నేటి నుంచే ప్రారంభం..


హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 7 గంటలకు మెట్రో రైల్ పట్టాలెక్కింది.. ఎక్కడిక్కడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, శానిటైజ్‌ చేస్తూ, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెట్రో రైళ్లు నడిపిస్తున్నారు. ఇవాళ కారిడార్ 1లో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్ రూట్‌లో మాత్రమే రన్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు... తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుపుతామని ప్రకటించారు అధికారులు.

అయితే మెట్రోస్టేషన్లలోకి ప్రవేశించినప్పుడు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి, ఎలాంటి లక్షణాలు లేని వారినే మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రయాణికులు తక్కువ లగేజీతో ప్రయాణం చేయాలని...శానిటైజర్‌ను వెంట తెచ్చుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. ఇక కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న మెట్రో స్టేషన్లను మూసి వేశారు. గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించడానికి మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు లోపల కూడా గుర్తులను మార్క్‌ చేస్తున్నారు.

ఆ మార్క్‌ ప్రాంతంలోనే ప్రయాణికులు నిల్చోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ సీటు రైలు లోపల ఎక్స్‌గా గుర్తించిన చోట ఖాళీగా ఉంటుంది. ఆ సీటులో కూర్చోవడం నిషేధం. ప్రయాణికులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు అధికారులు. మొత్తానికి లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి 22న నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. 168 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి.

Tags :
|
|

Advertisement