Advertisement

మొగుడే యముడు

By: Dimple Sat, 05 Sept 2020 08:31 AM

మొగుడే యముడు

అదనపు కట్నం తేవాలని అల్లుడు, వారి కుటుంబ సభ్యులు తన కుమార్తెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి కొట్టి చంపారని గురువారం కనిగిరి పట్టణంలోని సుభాష్‌రోడ్డులో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన భ్రమరాంబిక తండ్రి గుంటూరుకు చెందిన రామకృష్ణారావు శుక్రవారం కనిగిరి కమ్యూనిటీ వైద్యశాల వద్ద ఆరోపించారు.

కనిగిరిలో ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా పని చేస్తున్న సిరిగిరి లింగారావు, అతని తల్లి లింగమ్మ , తమ్ముళ్లు, ఆడపడుచులు తమ కుమార్తెను కట్నం కోసం చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ పెద్ద చదువులు చదువుకుందని.. ఉరి వేసుకునే అంత పిరికితనం లేదని రామకృష్ణారావు తెలిపారు. మంచి ఉద్యోగం ఉందని చీరాలకు చెందిన లింగారావుకు ఇచ్చి వివాహం చేశామన్నారు.

అడిగినంత కట్నం , నివేశస్థలం ఇచ్చామని, ఇంట్లో వస్తువులన్ని తామే కొని ఇచ్చామని, ఎప్పుడు ఏది కావాలంటే అది కొనిస్తూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత చేసినా లింగారావు, ఆయన కుటుంబ సభ్యులకు సంతృప్తి లేదని..పెళ్లి అయిన మూడేళ్ల నుంచి తమ కుమార్తెపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పది రోజుల క్రితం కూడా దుస్తులు కొనుగోలుకు డబ్బులు కావాలంటే అల్లుడి ఖాతాలో వేశానన్నారు.

వారం రోజుల క్రితం కారు కావాలని భర్త వేధిస్తున్నాడని తన కుమార్తె తెలిపిందని అది కొనిచ్చేందుకు కూడా సిద్ధపడ్డామని విలపించారు. మూడు రోజుల క్రితం కనిగిరికి వచ్చి వెళ్లామని .. ఇంతలోనే తమ కుమార్తెను కొట్టి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని రోదించారు. భ్రమరాంబిక పట్ల కిరాతంగా వ్యవహరించిన అల్లుడుని, అత్తను, మరదలను , వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

కమ్యూనిటీ వైద్యశాల వద్ద పోస్ట్‌ మార్టం గది సమీపంలో మృతురాలి బంధువులు, లింగారావు బంధువుల మధ్య గొడవ తలెత్తగా సీఐ కె. వెంకటేశ్వరరావు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags :
|

Advertisement