Advertisement

  • వందేళ్ల బామ్మ...రెండుసార్లు కరోనా సోకినా కోలుకుంది...మరి మనమెందుకు భయపడాలి...

వందేళ్ల బామ్మ...రెండుసార్లు కరోనా సోకినా కోలుకుంది...మరి మనమెందుకు భయపడాలి...

By: chandrasekar Thu, 03 Dec 2020 11:30 PM

వందేళ్ల బామ్మ...రెండుసార్లు కరోనా సోకినా కోలుకుంది...మరి మనమెందుకు భయపడాలి...


అమెరికాకు చెందిన ఏంజెలినా ఫ్రైడ్మాన్ అనే బామ్మ కరోనా మహమ్మారిని విజయవంతంగా జయించింది. దీంట్లో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా? ఆమెకు వందేళ్లకు పైగా వయసుంది. చిన్నప్పుడే ఒక మహమ్మారికి బలికాకుండా బయటపడింది. ఆ తరువాత క్యాన్స్‌ర్‌ను జయించింది. ఇప్పడు ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు కరోనా సోకినా భయపడలేదు. కరోనా మహమ్మారితో పోరాడి గెలీచింది. ఆ బామ్మ న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఆమెకు ఇప్పుడు 102ఏళ్ల వయసు. శిశువుగా ఉన్నప్పుడే ఆమె 1918 లో ప్రపంచాన్ని గడగడవణికించిన ఫ్లూ బారిన పడి కోలుకుంది. పెద్దయ్యాక క్యాన్సర్ వచ్చినా చికిత్స తీసుకొని బయటపడింది. ఈ సంవత్సరం రెండుసార్లు కరోనావైరస్ సోకినా ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారి ఏంజెలినాను ఏమీ చేయలేకపోయిందని ఆమె కూతురు జోవాన్ మెరోలా చెప్పారు.

ఏంజెలినాకు ఈ ఏడాది మార్చిలో మొదటిసారి వైరస్ సోకింది. వారం రోజులు మందులు వాడినా ప్రతిఫలం లేకపోవడంతో ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. ఆ తరువాత కొన్ని వారాల పాటు జ్వరంతో బాధపడింది. చివరకు ఏప్రిల్ 20న కరోనా నెగెటివ్ రిపోర్డు రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. అక్టోబర్ నెలాఖరులో ఏంజెలినాకు మళ్లీ కరోనా సోకింది. జ్వరం, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తన కూతురు మెరోలాకు డాక్టర్లు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ తరువాత బామ్మను ఐసోలేషన్లో ఉంచి ట్రీట్‌మెంట్ చేశారు. కొన్ని వారాల పోరాటం తరువాత నవంబర్ 17న వైరస్ లోడ్ తగ్గి కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చినట్టు డాక్టర్లు చెప్పారు. వినికిడి లోపం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు తప్ప బామ్మకు ఇప్పుడు పెద్దగా అనారోగ్య సమస్యలు లేవని ఆమె కూతురు మెరోలా అన్నారు.

ఈ బామ్మ 1918లో ఇటలీ నుంచి న్యూయార్క్ నగరానికి వలసదారులను తీసుకెళ్తున్న ఓడలో ఏంజెలీనా పుట్టింది. అప్పట్లో మహమ్మారి ప్రభావంతో ఎంతోమంది చనిపోయారు. ఆమె పుట్టగానే తల్లి చనిపోయింది. శిశువుగా ఉన్నప్పుడే ఫ్లూ సోకింది. దీంతో ఇద్దరు అక్కలు ఏంజెలినా బాధ్యతలు చూసుకున్నారు. న్యూయార్క్‌లో ఉన్న తమ తండ్రి వద్దకు చేరుకున్న తరువాత వారందరూ బ్రూక్లిన్‌లో నివసించారని మెరోలా చెప్పారు. ఏంజెలినా, ఆమె భర్త ఒకే సమయంలో క్యాన్సర్‌ బారిన పడ్డారు. కానీ భర్త చనిపోగా, ఏంజెలినా మాత్రం కోలుకుంది. అంత వయసు వచ్చినా ఇంకా ఆమె తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతుందని, గతేడాది 101వ పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకుందని మెరోలా తెలిపారు.

Tags :
|

Advertisement