Advertisement

కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా

By: Sankar Fri, 03 July 2020 8:54 PM

కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా



కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ పరీక్ష జూలై 19-23 వరకు, నీట్ పరీక్ష జూలై 26న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు హెచ్చార్డీ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్‌, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను సెప్టెంబర్‌ 27న నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, మహమ్మారి కరోనా భయాలతో జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు అందడంతో.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని కొందరు, వాటి నిర్వహణపై క్లారీటీ ఇవ్వాలని మరికొందరు మానవ వనరుల శాఖకు విన్నవించారు.

ఈక్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ గురువారం ఓ కమిటీని నియమించారు. కమిటీ నివేదికను అనుసరించి పరీక్షలు వాయిదాకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 9 లక్షల మంది, నీట్‌కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేశారు.

Tags :
|
|
|

Advertisement