Advertisement

  • హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్లు మార్కెట్లు చేరడం అనుమానం

హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్లు మార్కెట్లు చేరడం అనుమానం

By: chandrasekar Wed, 01 July 2020 10:51 AM

హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్లు మార్కెట్లు చేరడం అనుమానం


భారత్-నేపాల్ ఉద్రిక్తతల వల్ల ఆపిల్ పండ్లు తినేవాళ్ల జేబులపై భారం పడేలా ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల కోసం దేశవ్యాప్తంగా మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఒక నెలలో ఇక్కడి పండ్లు మార్కెట్లకు చేరేందుకు సిద్ధం కావాలి. కానీ, ఆపిల్ వ్యాపారులు ఆందోళనతో ఉన్నారు. ఆపిల్ పండ్లు మార్కెట్లు చేరడం అనుమానంగా మారింది. నేపాల్‌కు చెందిన దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు హిమాచల్‌లో పనిచేస్తుంటారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వారిని వెన్నెముకగా విశ్లేషకులు భావిస్తారు. అయితే, ఏప్రిల్ తర్వాత నేపాలీ కార్మికులు ఆపిల్ తోటలకు రావడం మానేశారు.

మొదట్లో కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు భారత్, నేపాల్ మధ్య సంబంధాలు దెబ్బతింటుండటం వ్యాపారులకు ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకు వెళ్లకుండా ఇక్కడే ఉన్న నేపాలీలు కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాళ్ల ఇళ్లకు వెళ్లారు. సాధారణంగా ఆపిళ్లను తెంపే సీజన్ కన్నా చాలా ముందే మార్చి-ఏప్రిల్‌ నెలల్లోనే నేపాలీ కార్మికులు ఇక్కడికి తిరిగి వస్తుంటారు. పండ్లను తెంపడంతోపాటు డబ్బాల్లో వాటిని ప్యాకింగ్ చేయడం, ట్రక్కుల్లోకి ఎక్కించడం, దింపడం వంటి పనులు కూడా చేస్తుంటారు.

‘‘తోటల్లో కూలీల సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. మేం ప్రయత్నాలు చేసినా, నేపాలీ కూలీలు ఈ సీజన్‌లో వచ్చేందుకు ఇష్టపడటం లేదు. వ్యక్తిగత స్థాయిలో నేను చాలా ప్రయత్నించా. కానీ, నాకు ఎక్కువ ఆశలైతే లేవు’’ అని రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి నరేందర్ బ్రగ్తా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయ్‌రామ్ ఠాకుర్ కూడా తమ సమస్యను విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు బ్రగ్తా చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించే ప్రయత్నం కూడా చేశారని అన్నారు. రాజకీయ స్థాయిలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, సానుకూల ఫలితాలు రాలేదని చెప్పారు.

‘‘వాళ్లు ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తి భయంతో లేరు. భారత్, నేపాల్ మధ్య శత్రుత్వం పెరుగుతుండటం పట్ల ఆందోళనతో ఉన్నారనుకుంటా. నేపాల్‌లో వారికి ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసి ఉండొచ్చు. మాలాంటి ఆపిల్ ఉత్పత్తిదారులకు ఇది ఊహించని సంక్షోభం’’ అని సీపీఎం ఎమ్మెల్యే రాజేశ్ సిన్హా అన్నారు. తన వద్ద పనిచేసే నేపాల్ కార్మికులకు తాను ఈ మధ్యే అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించానని, వాళ్లు సీజన్‌కల్లా వస్తారని అనుకున్నానని స్థానికుడు జోగిందర్ చౌహాన్ చెప్పారు.

‘‘ఇప్పుడు వాళ్లంతా సరిహద్దుల వద్ద ప్రతికూల పరిస్థితుల కారణంగా రాలేకపోతున్నామని అంటున్నారు. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని, వచ్చే ఏడాది లెక్కల్లో చూసుకుందామని ఇంకొందరు చెబుతున్నారు’’ అని ఆయన వివరించారు. నేపాల్ కార్మికుల విషయంలో ఉన్న సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని హిమాచల్ సీఎం జయ్‌రామ్ ఠాకుర్ చెప్పారు.

‘‘బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది చాలా కాలం తర్వాత రాష్ట్రానికి తిరిగివచ్చారు. వాళ్లకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తాం’’ అని అన్నారు.

తాత్కాలికంగా ఇక్కడి తోటల్లో ఉండిపోయిన కొన్ని నేపాలీ కుటుంబాలు తమ దేశంలో వ్యాపిస్తున్న వదంతుల గురించి చెప్పాయి. ‘‘భారత్ వెళ్తే నేపాల్ పౌరసత్వం రద్దవుతుందని, సరిహద్దులను మూసేస్తారని అక్కడ పుకార్లు వ్యాపిస్తున్నాయి. భారత్ నుంచి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే కూడా సీజ్ చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి’’ అని కోట్‌గఢ్‌లో ఉంటున్న రామ్ బహదూర్ బీబీసీతో చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్‌లో బయటి నుంచి వచ్చినవారికి క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటం వల్ల కూడా నేపాల్ కార్మికులు ఆగిపోతున్నారని నార్కండాలోని యాపిల్ తోట యజమాని ఎల్‌సీ డోగ్రా చెప్పారు. ఆపిల్ తోటలకు వచ్చే కార్మికుల కోసం నిబంధనలు కాస్త సడలించడం వీలవుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి రామ్ లాలా మర్కండా చెప్పారు. ‘‘నేపాల్ కార్మికులు రావడమే లేదు. అదే అసలు సమస్య’’ అని ఆయన అన్నారు.

గత సంవత్సరం రాష్ట్రంలో 20 కేజీల ఆపిల్ పెట్టెలు నాలుగు కోట్ల దాకా ఉత్పత్తయ్యాయి. కానీ, అప్పటితో పోల్చితే ఈ ఏడాది దిగుబడి 40 నుంచి 50 శాతం తగ్గింది. కార్మికుల కొరత సమస్యతో ఇప్పుడు అవి కూడా మార్కెట్లు చేరేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది హిమాచల్ ఆపిల్ కొనే వినియోగదారులపై భారం పడొచ్చని స్థానికులు అంటున్నారు .

Tags :
|

Advertisement