Advertisement

  • ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు

By: Dimple Sat, 05 Sept 2020 3:43 PM

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు

మాజీ ముఖ్యమంత్రి నందమూరితారక రామారావుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రామారావు గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పాఠ్యాంశంగా తీసుకొచ్చారు. రాజకీయాలపట్ల ప్రజాచైతన్యం తీసుకొచ్చిన రామారావు తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమా నటుడిగా... రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పేద ప్రజానీకానికి ఆరాధ్యదైవంగా రాణించారు.

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్‌ చేశారు.

‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని బాలయ్య పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement