Advertisement

తెలుగు రాష్ట్రాల లో భారీ వర్షాలు

By: chandrasekar Fri, 12 June 2020 7:01 PM

తెలుగు రాష్ట్రాల లో భారీ వర్షాలు


తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రానికి రావొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిప్రభావంతోనే గురు, శుక్ర వారాల్లో ఓ మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల అంచనా.

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ కర్నాటక, రాయలసీమ, తమిళనాడులోని మెజార్టీ జిల్లాలను తాకాయని పేర్కొంది. బంగాళా ఖాతం తీరం వెంబడి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇక్కడ నుంచి నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర కర్నాటకలోని ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచి తెలంగాణకు విస్తరిస్తాయని వెల్లడించింది.తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ అల్పపీడనం ఏర్పడి రానున్న 2 రోజుల్లో అది తుఫానుగా మారుతుందని తెలిపింది.

ఈ తుఫాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత తీవ్రగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ కోస్తాంధ్రకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ప్రాంతాలతో పాటు యానాంలో కూడా ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతం, రాయలసీమల్లో జూన్ 11న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Tags :

Advertisement