Advertisement

  • తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు...

తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు...

By: chandrasekar Thu, 15 Oct 2020 09:34 AM

తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు...


తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద ప్రవాహమే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టితో మూసీ నది ఎన్నడూ లేనంతగా ప్రవహిస్తోంది. హిమాయ‌త్‌ సాగ‌ర్ గేట్లు ఎత్తివేయ‌డంతో బుధ‌వారం (అక్టోబర్ 14) వేకువజామున నుంచే మూసీ న‌ది ఉధృతంగా ప్రవ‌హిస్తోంది. దీంతో సూర్యాపేటలోని మూసీ జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది. మూసీ డ్యామ్‌లోకి ఔట్ ఫ్లో కంటే అధికంగా ఇన్‌ఫ్లో ఉంది. గేట్లన్నింటినీ తెరిచి నీటిని కిందకి విడుదల చేస్తున్నప్పటికీ ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో వరద బీభత్సానికి డ్యామ్ కొట్టుకుపోవచ్చనే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. అదే జరిగితే ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతాయని పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. అయితే అలాంటి భయమేదీ అక్కర్లేదని మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా అధికారులు చెబుతున్నారు. మూసీకి పోటెత్తిన వ‌ర‌ద‌పై అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మీక్షించారు. నీటి పారుద‌ల శాఖ ఉన్నతాధికారుల‌తో పాటు సూర్యాపేట‌, న‌ల్లగొండ జిల్లాల క‌లెక్టర్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ప‌లు సూచ‌న‌లు చేశారు. సూర్యాపేట జిల్లా ర‌త్నపురం వ‌ద్ద గండి పెట్టి వరద ప్రవాహం కిందకు పోయేలా చూడాలని అధికారులకు మంత్రి జగదీశ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మూసీ న‌ది ఆయ‌క‌ట్టుకు ఎలాంటి ప్రమాదం లేకుండా చ‌ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూసీ న‌ది గేట్లు ఎత్తడంతో 1.75 ల‌క్షల క్యూసెక్కుల నీరు కింద‌కు విడుదల అవుతోంది. ఎగువ నుంచి 2 ల‌క్షల క్యూసెక్కుల‌కు పైగా వ‌ర‌ద ప్రవాహం కొనసాగుతోంది.

ఇది యిలా ఉంటే.. తెలంగాణ‌పై వాయుగుండం కొన‌సాగుతూనే ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి బారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించారు. వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా బలహీనపడకుండా స్థిరంగా కొన‌సాగుతోందని ఈ కారణంగా భారీ వర్షాలు తప్పవని వివరించారు.

Tags :

Advertisement