Advertisement

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో భారీ వర్షం

By: Sankar Wed, 21 Oct 2020 08:23 AM

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో భారీ వర్షం


హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో వానపడింది. అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

పాతబస్తీ, ఫలక్‌నుమా, చాంద్రయాణగుట్ట, ఉప్పుగూడ, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేటలో వాన పడింది. ఉదయం ఏడు గంటల వరకు నాంపల్లిలో 40 మిల్లీమీటర్లు, చార్మినార్‌లో 40, ముషిరాబాద్‌లో 30, మేడిపల్లి, సికింద్రాబాద్‌, అసిఫ్‌నగర్‌, గోల్కొండ, బహదుర్‌పుర, సైదాబాద్‌, ఖైతరాబాద్‌లో 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారానికి మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉన్నదని చెప్పారు.

మూడ్రోజుల్లో ఇది వాయవ్యదిశగా ప్రయాణించొచ్చని, అల్పపీడనానికి అనుబంధంగా 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో రెండ్రోజులు జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు వివరించారు.

Tags :

Advertisement