Advertisement

  • హృదయ విదారక పరిణామం ...అడిషనల్ కలెక్టర్ చికిత్సకు చిల్లిగవ్వ లేదు...

హృదయ విదారక పరిణామం ...అడిషనల్ కలెక్టర్ చికిత్సకు చిల్లిగవ్వ లేదు...

By: chandrasekar Fri, 16 Oct 2020 8:06 PM

హృదయ విదారక పరిణామం ...అడిషనల్ కలెక్టర్ చికిత్సకు చిల్లిగవ్వ లేదు...


అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ ఎమ్మార్వో, అంతకన్నా తక్కువ స్థాయి ఉద్యోగులు సైతం ఇటీవల ఏసీబీకి చిక్కినప్పుడు వారివద్ద కోట్లాది రూపాయల నల్లధనం బయట పడింది. కానీ, నిజాయతీగా అంచెలంచెలుగా అడిషనల్ కలెక్టర్ స్థాయి వరకూ ఎదిగిన ఓ ఉన్నతాధికారి మాత్రం వైద్యం కోసం ఇప్పుడు చేయి చాచాల్సివస్తోంది. భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న వైవీ గణేష్ విషయంలో ఈ హృదయ విదారక పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు చికిత్స చేసుకొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌ గణేష్‌ను స్నేహితులు ఆదుకొంటున్నారు. ఆయన వైద్యం కోసం చందాలను పోగేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ ర్యాంకులో ఉన్నప్పటికీ చికిత్స కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఆయనకు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదిగి అడిషనల్ కలెక్టర్ హోదాకు వైవీ గణేష్ చేరుకొన్నారు. నిజాయతీ గల అధికారిగా ఆయనకు మంచి పేరుంది.

కొద్ది రోజుల క్రితం గణేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనకు హన్మకొండలోని ఆసుపత్రిలో తొలుత చికిత్స చేయించారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జీతంపై ఆధారపడి మాత్రమే ఆయన జీవనం సాగిస్తారు. దీంతో వైద్యం చేయించుకొనేందుకు గణేష్ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఈ విషయం తెలిసిన మిత్రులు, బ్యాచ్ మేట్స్, కింది స్థాయి ఉద్యోగులు విరాళాలు సేకరిస్తున్నారు.

ఇప్పటికే ఆయన వైద్యం కోసం రూ.10 లక్షలను సేకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం గ్రామానికి చెందిన గణేష్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబం ఖమ్మంలోనే ఉంటుంది. ఉద్యోగరీత్యా ఆయన భూపాలపల్లిలో ఉంటున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆయన స్నేహితులు అంటున్నారు.

Tags :

Advertisement