Advertisement

  • మెట్రో పున: ప్రారంభించాక అనుసరించాల్సిన మార్గదర్శకాలు: తెలంగాణ ప్రభుత్వం

మెట్రో పున: ప్రారంభించాక అనుసరించాల్సిన మార్గదర్శకాలు: తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Thu, 03 Sept 2020 2:03 PM

మెట్రో పున: ప్రారంభించాక అనుసరించాల్సిన మార్గదర్శకాలు: తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్‌లో అన్‌లాక్ 4 మార్గదర్శకాలను అనుసరించి మెట్రో రైళ్ల ప్రారంభానికి హెచ్‌ఎంఆర్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 7 నుంచి పట్టాలపై మెట్రో రైళ్లు పరుగులు తీయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రైళ్లు ప్రారంభం అయ్యాక కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. పిల్లలు, వయసు పైబడిన వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెట్రో రైలులోకి ప్రవేశాన్ని కల్పించడాన్ని ప్రస్తుతానికి నిషేధించనున్నారు.

అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులను పూర్తిగా నిలిపివేయనున్నారు. అంతేకాక, టికెట్లను కూడా కౌంటర్ల నుంచి నేరుగా కొనుక్కోవడానికి స్వస్తి పలకబోతున్నారు.

ప్రయాణానికి స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ టికెట్లకు మాత్రమే అనుమతి ఉందని హెచ్ఎంఆర్ సంస్థ వెల్లడించింది. గత 6 నెలలుగా సర్వీసులు నిలిపివేయడంతో 3 కారిడార్లు, 57 మెట్రో స్టేషన్లలో క్లీనింగ్‌, శానిటేషన్‌ పనులను అధికారులు చేస్తున్నారు.

రెండు రోజుల్లో హెచ్‌ఎంఆర్‌ పూర్తి గైడ్‌లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

కరోనా ధాటికి గత మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని రెండో అతి పొడవైన మెట్రో వ్యవస్థ కలిగిన హెచ్ఎంఆర్ సంస్థ రోజుకు 55 రైళ్లతో రాకపోకలు సాగిస్తోంది. 4.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. కరోనా‌తో గత ఆర్నెల్లుగా రైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి.

Tags :
|

Advertisement