Advertisement

పోలవరం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్...!

By: Anji Mon, 02 Nov 2020 7:57 PM

పోలవరం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్...!

పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం లేఖ రాయడం, తాజాగా ఈ విషయంలో కేంద్రం మీద ఒత్తిళ్ళు పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది.

పోలవరం బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి స్పందన వ్యక్తమైంది. పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. దాంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్ళీ ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

పెండింగ్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం స్పష్టమైన ఆదేశాలు విడుదలైనట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఏపీ ప్రభుత్వం గతంలోనే అన్ని వివరాలు కేంద్ర జలశక్తి శాఖకు అందజేసింది. అయితే కారణాలేవైతేనేం అన్ని ఆడిటింగులు పూర్తయిన తర్వాత కూడా నిధుల విడుదల జరగలేదు.

తాజాగా ముఖ్యమంత్రి మోదీకి లేఖ రాయడం.. పలు రకాలుగా రాజకీయ ఒత్తిళ్ళు కేంద్రం మీద పెరిగిపోవడంతో ఆర్థిక శాఖ స్పందించింది. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా పలువురు పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు సంబంధించి అభ్యర్థనలు అందజేశారు. దానికి తోడు నిధులను పెండింగులో పెట్టేందుకు సాంకేతిక కారణాలు కూడా లేవు.

దాంతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర జలశక్తి శాఖకు నిధుల విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సోమవారం మెమోను పంపింది కేంద్ర ఆర్థికశాఖ. మొత్తం రూ. 2234.288 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని మెమోలో పేర్కొన్నారు ఆర్థిక శాఖ అధికారులు.

వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తిచేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో ద్వారా తెలియజేసింది.

Tags :

Advertisement