Advertisement

  • సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ....తెలంగాణ హై కోర్ట్

సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ....తెలంగాణ హై కోర్ట్

By: chandrasekar Sat, 18 July 2020 8:21 PM

సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ....తెలంగాణ హై కోర్ట్


తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు మార్గం సుగమమైంది. ఉన్న వాటిని కూల్చివేయడానికి పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొసిలిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ రాసిన లేఖను కోర్టు పరిశీలనకు అందజేశారు. హైకోర్టు సీజే జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం లేఖను పరిశీలించి, సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

ఈ వ్యాజ్యంలో గతంలో జారీ చేసిన మధ్యంతర స్టే ఆదేశాలు వాటంతట అవే తొలగిపోతాయని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ల తరుపు న్యాయవాది వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. పర్యావరణ అనుమతులు పొందాలన్నది కేవలం ఒక రైడర్‌ మాత్రమేనని, కూల్చివేతలకు ముందుగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధి విపత్తు చట్టం నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించింది. ఇవేవీ కూల్చివేతలకు అడ్డుకాబోవని తెలిపింది. కరోనా వైరస్‌ నలుదిశలా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌-2016లోని రూల్‌ 4(3) వ్యతిరేకంగా సచివాలయ భవనాలు కూల్చివేతలు చేపట్టారని, వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న ధర్మాసనం చివరిగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావును ఉద్దేశిస్తూ, సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? కాదా? కేంద్ర పర్యావరణ శాఖ అధికారులను సంప్రదించి కోర్టుకు తెలపాలని గురువారం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన వివరణను ఏఎ్‌సజీ కోర్టుకు సమర్పించారు. ఉన్న భవనాలను కూల్చివేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు అవసరం లేదని చెప్పారు. నూతనంగా నిర్మించే వాటికే అనుమతులు అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. నూతన భవన సముదాయం నిర్మాణం కోసం ప్రస్తుతానికి భూమిని సిద్ధం చేస్తున్నామని, భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపడతామని తెలిపారు. భవనాల కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ నుంచి పొందిన అనుమతులు, శిథిలాలను తొలగించడానికి అనుసరించే ప్రణాళికను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధి విపత్తు చట్టంలోని నిబంధనలకు లోబడే కూల్చివేతలు చేపడతామన్నారు. పిటిషనర్ల తరుఫున న్యాయవాది ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలో 7 లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించాలని తలపెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. 2006 సెప్టెంబర్‌ 14న జారీచేసిన పర్యావరణ ప్రభావిత అంచనా నోటిఫికేషన్‌ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాలని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏజీ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Tags :

Advertisement