Advertisement

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు

By: Sankar Wed, 16 Sept 2020 08:09 AM

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు


దేశ వ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లి సాగు గణనీయంగా చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

రాష్ట్రంలోనే నెల రోజుల కిందటితో పోలిస్తే ధర రెట్టింపయ్యింది. కిలో రూ.40 మేర పలుకుతోంది. పొరుగు నుంచి రావాల్సిన సరఫరా సగానికి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది.

దేశంలో లాక్‌డౌన్‌ విధించే నాటికి కిలో ఉల్లి ధర రూ.10–15కి మధ్యకి చేరింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ కూరగాయల ధరలు పెరిగినా ఉల్లి ధర మాత్రం కిలో రూ.20 దాటలేదు. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో.. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు మళ్లీ దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15–20 పలికిన ధర ప్రస్తుతం రూ.35–40కి చేరింది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా క్రమంగా తగ్గుతోంది.

రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం గత ఏడాది మాదిరి ధరలు పెరగకుండా నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతున్నాయి. ఇక ధరల పెరుగుదలను బట్టి ఉల్లి నిల్వలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది

Tags :
|

Advertisement