Advertisement

  • రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళనపై అసంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్

రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళనపై అసంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్

By: chandrasekar Sat, 03 Oct 2020 10:39 AM

రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళనపై అసంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్


రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళనపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్‌భవన్‌ రాజకీయ అడ్డా కాదని ఘాటుగా స్పందించారు. రాజ్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేయడంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవుపలికారు. కరోనా కారణంగానే తానెవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని స్పష్టంచేశారు. నాలుగు నెలలుగా రాజ్‌భవన్‌ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నదని తెలిపారు.

అందువల్ల వాళ్ళ రాజకీయ డ్రామా చేయడం సరికాదన్నారు. శుక్రవారం గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ ప్రారంభించారు. రాజ్‌భవన్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుందని చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పలేనుగానీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె తెలిపారు. ఈ-మెయిల్‌ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన రాజకీయ పార్టీలు భౌతికదూరం పాటించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మహాత్మాగాంధీ కలలకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కితాబిచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో ఇతరరాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ ముందంజలో ఉన్నదని కొనియాడారు. ఈ క్రమంలో ప్రభుత్వం అద్భుత ఫలితాలను సాధించిందని ప్రశంసించారు. రికవరీ రేటులో రాష్ట్రం ఉన్నతస్థానంలో ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం పెరిగితే, మన రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నదని చెప్పారు.

గవర్నర్‌ తమిళిసై శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు బాగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ అత్యధిక వరి దిగుబడిని సాధించి రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా నిలువడం గర్వంగా ఉన్నదని తెలిపారు. తాను వృత్తిపరంగా వైద్యురాలిని అయినప్పటికీ వ్యవసాయరంగంతో ఆత్మీయ అనుబంధం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు వందశాతం ఆమోదం ఎక్కడా ఉండదని, కానీ ప్రజల మేలుకోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు.

ఈ-ఆఫీస్ ఆవిష్కరణలో భాగంగా డిజిటలైజేషన్‌లో ప్రారంభించిన ఈ-ఆఫీస్‌ కాగిత రహిత, పర్యావరణహితంగా ఉంటుందని చెప్పారు. తద్వారా రాజ్‌భవన్‌ కార్యక్రమాలు సురక్షితంగా, వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని తెలిపారు. సచివాలయంలో అమలుచేస్తున్న ఈ- ఆఫీస్‌ విధానాన్ని అభినందించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా రాజ్‌భవన్‌ పనిచేస్తుందని, ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే తాను పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడుతానని, తాను తమిళనాడు బిడ్డనని, తెలంగాణకు సోదరినని పేర్కొన్నారు. తన ప్రసంగంలో ఇలా పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.

Tags :

Advertisement