Advertisement

  • మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరణ...

మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరణ...

By: chandrasekar Fri, 23 Oct 2020 1:27 PM

మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరణ...


మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా జాతీయ స్థాయి కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఆయా కేసుల దర్యాప్తు చేపడుతుంది. మరోవైపు గత కొన్ని నెలల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకుతమ సమ్మతిని తెలియజేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ తన దర్యాప్తును చేపట్టేది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసు దర్యాప్తుతోపాటు తాజాగా టీఆర్పీ రేటింగ్‌ కుంభకోణంపై సీబీఐ జోక్యం చేసుకోనుండటమే దీనికి కారణం. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రిపబ్లిక్‌ టీవీ టీఆర్పీ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే దురుద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లో కూడా దీనిపై కేసు నమోదైందని తెలిపారు. సుశాంత్‌ మరణం కేసును బీహార్‌లో నమోదు చేసిన మాదిరిగా ఈ కేసు దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన విమర్శించారు.

రాజకీయాల కోసం సీబీఐ సంస్థను వాడుకోవడం సరికాదన్నారు. అందుకే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన దర్యాప్తు సమ్మతిని తాజాగా వెనక్కి తీసుకున్నదని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కేసులకు ఇది వర్తించదని చెప్పారు. సీబీఐ కొత్తగా దర్యాప్తు చేయబోయే కేసులకు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, మహారాష్ట్రకు చెందిన కేసుల విషయంలో సీబీఐ జోక్యం చేసుకుంటున్నదని అధికార శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర పోలీసులకు సొంత హక్కులు ఉన్నాయని చెప్పారు. వాటిని హరించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందని ఆయన చెప్పారు.

Tags :

Advertisement