Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్...

By: chandrasekar Tue, 13 Oct 2020 09:54 AM

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్...


చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చ జండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారానే ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఇటీవలే టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం ఇచ్చారు. ఇందుకు సంబంధిత ఫైల్‌పై ఆయన సంతకం కూడా చేశారు.

బదిలీలు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం వల్ల పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం జగన్ ఆమోదం నేపథ్యంలో తాజాగా బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. కాగా, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇందువల్ల వారి అనుకూల స్థలాలకు బదిలీలు పొందవచ్చు.

Tags :
|
|

Advertisement