Advertisement

కేసీఆర్ కిట్‌లలో గోల్‌మాల్...!

By: Anji Tue, 22 Sept 2020 5:19 PM

కేసీఆర్ కిట్‌లలో గోల్‌మాల్...!

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్‌లలో గోల్‌మాల్‌ జరిగింది. కేసీఆర్ కిట్ పేరిట గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ విభాగంలో కొంతకాలం కిందట సతీష్‌ అనే వ్యక్తి చేరాడు. కేసీఆర్ కిట్ రాని గర్భిణుల సమాచారం సేకరించి.. దరఖాస్తు సరిగా లేదని, తనకు తెలిసిన ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేవాడు.

ఆ సెంటర్‌ సతీష్‌కి చెందినదే కాగా.. అక్కడకు వచ్చిన ప్రతి గర్భిణి వద్ద కేసీఆర్ కిట్ కోసం దరఖాస్తుకు రూ.1000 తీసుకొని రసీదు ఇచ్చేవాడు. ఇక ఆ రసీదును ఆసుపత్రిలో తనకు ఇవ్వాలని సూచించేవాడు. ఇలా కిట్లు రాని వందమంది గర్భిణుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా కిట్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆసుపత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై డీఎం అండ్ హెచ్‌వో స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్‌లలో అవకతవకలు గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశామని అన్నారు. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో అసలు విషయం బయటపడిందని, పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయని స్వరాజ్యలక్ష్మి అన్నారు.

Tags :

Advertisement