Advertisement

జలదిగ్బంధంలో భద్రాద్రి జనావాసాలు

By: Dimple Tue, 18 Aug 2020 00:56 AM

జలదిగ్బంధంలో భద్రాద్రి జనావాసాలు

అల్పపీడన ప్రభావంతో గత అయిదు రోజులుగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న జోరు వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, చెరువులకు పోటెత్తుతున్న ప్రవాహం పంట చేలను ముంచెత్తింది. అన్నదాతలకు తీరని నష్టాల్ని మిగిల్చింది. వంతెనల వద్ద వాగుల ఉద్ధృతితో పలు గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి.

కురిసిన వర్షానికి చర్ల మండలంలో అత్యధికంగా 157.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లో కలిపి 1333.0 మి.మీ. వర్షపాతం కురిసింది. సగటు 78.4 మి.మీ.గా నమోదైంది. పినపాక 141.4, దుమ్ముగూడెం 110.4, అశ్వాపురం 110.6, మణుగూరు 132.6, గుండాల 81.6, ఇల్లెందు 72, టేకులపల్లి 47.2, జూలూరుపాడు 46.6, చంద్రుగొండ 44.6, కొత్తగూడెం 70.2, పాల్వంచ 70.4, బూర్గంపాడు 71.6, భద్రాచలం 69.2, ముల్కలపల్లి 45.2, దమ్మపేట 36.8, అశ్వారావుపేట మండలంలో 25.2 మి.మీ వర్షం కురిసింది.
లక్ష్మీదేవిపల్లి: రేగళ్లలో వాగులు ఉప్పొంగడంతో పత్తి చేలు నీట మునిగాయి. విద్యానగర్‌, రామాంజనేయకాలనీలో చింతలచెరువు వద్ద ఇళ్లకు వరద పోటెత్తింది.
పాల్వంచ పట్టణం: రాజపురం-యానంభైలు మధ్య వంతెనపై ఏటా ముంపు సమస్య తలెత్తుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) విమర్శించారు.

వంతెన వద్ద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం విచారకరమన్నారు.మణుగూరులో..: పేరంటాల చెరువు అలుగు పోసింది. పగిడేరు-సాంబాయిగూడెం మధ్య రాకపోకలు నిలిచాయి. అశోక్‌నగర్‌, సుందరయ్యనగర్‌లో ఇళ్లలోకి వరద చేరింది. మణుగూరు-కమలాపురం మధ్య రాకపోకలు నిలిచాయి.
మద్దులగూడెం, సింగిరెడ్డిపల్లి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అక్కడి పరిస్థితిని విప్‌ రేగా కాంతారావు పరిశీలించారు. ఏడూళ్లబయ్యారం పంచాయతీ వాగబోయిన గుంపును వరద నీరు చుట్టుముట్టింది. 20 గిరిజన కుటుంబాలను సీఐ రమేశ్‌, సర్పంచి రజిని బయటకు తీసుకొచ్చారు. వారికి పోతురెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. పినపాక- మారేడుగూడెం రహదారిపై వరద పరిస్థితులను తహసీల్దారు మహేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

Tags :

Advertisement