Advertisement

  • దేవుడి ఆశీర్వాదం వల్లే కరోనా వచ్చింది: ట్రంప్

దేవుడి ఆశీర్వాదం వల్లే కరోనా వచ్చింది: ట్రంప్

By: chandrasekar Sat, 10 Oct 2020 4:49 PM

దేవుడి ఆశీర్వాదం వల్లే కరోనా వచ్చింది: ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా నుంచి దాదాపుగా కోలుకున్నట్టే. ఆయనలో ఎలాంటి లక్షణాలు లేవని వైట్‌ హౌస్ వైద్యుడు సియాన్ కాన్లే చెప్పారు. అతి త్వరలో ప్రజల ముందుకు వస్తారని ఆయన తెలిపారు. ట్రంప్ కరోనా బారినపడి పది రోజులు. నేడు నిర్వహించే కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ అవుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రి ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ కూడా ఇదే విషయం చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బావుందన్నారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారు. మరోవైపు ట్రంప్‌కు అందించాల్సిన కరోనా చికిత్స పూర్తయినట్లు డాక్టర్‌ సియాన్‌ కాన్లే తెలిపారు. 4 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆయన సోమవారం శ్వేతసౌధం చేరుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ఆయనకు అక్కడే చికిత్స కొనసాగించారు. ఇక ఆయన ప్రజల ముందుకు రావడం సురక్షితమేనని వైద్యులు చెప్పారు. గత శుక్రవారం నుంచి ట్రంప్‌లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పారు.

‘చికిత్సకు ట్రంప్ బాగా స్పందించారు. ఇచ్చిన మందుల వల్ల ఆయనలో ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు. ట్రంప్‌కు కరోనా సోకి శనివారంతో 10 రోజులు పూర్తవుతాయి. డాక్టర్ల బృందం అందించిన అధునాతన చికిత్స ద్వారా అధ్యక్షుడు పూర్తిగా కోలుకొని అదే రోజు ప్రజల ముందుకు సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నాను’ అని డాక్టర్ కాన్లే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని వ్యాఖ్యానించారు. తనకు అందించిన మందుల్లో రీజెనరాన్‌ యాంటీబాడీ డ్రగ్‌ బాగా పనిచేసిందని ట్రంప్‌ తెలిపారు. దాని వల్లే కోలుకున్నానని చెప్పారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించారు.

డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ఆఖరుకి కరోనావైరస్ కూడా మార్చలేకపోయిందంటూ విపక్ష సభ్యులు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను ఉదాహరణగా పేర్కొంటున్నారు. దేవుడి ఆశీర్వాదం వల్లే తనకు కరోనా వచ్చిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. వైరస్‌ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి తాను ముందుగానే అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ట్రంప్ రెండు రోజుల కిందట వైట్ హౌస్‌కు తిరిగొచ్చారు. బుధవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘కరోనా సోకడం వల్ల నాకు చాలా విషయాలు తెలిశాయి. కరోనాకు డాక్టర్లు అందిస్తున్న చికిత్స ఎంత ఉత్తమమైనదో స్వయంగా తెలుసుకోగలిగాను. ఓ అధ్యక్షుడిగా కొవిడ్‌కు నేను ఎలాంటి చికిత్స అయితే తీసుకున్నానో అదే చికిత్సను అమెరికా ప్రజలకు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement