Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలు.. 68 మంది నామినేషన్లు తిరస్కరణ

జిహెచ్ఎంసి ఎన్నికలు.. 68 మంది నామినేషన్లు తిరస్కరణ

By: Sankar Sun, 22 Nov 2020 08:36 AM

జిహెచ్ఎంసి ఎన్నికలు.. 68 మంది నామినేషన్లు తిరస్కరణ


జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. మొత్తం 1,893 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, వీటిల్లో 1,825 మంది నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించిన అధికారులు, మిగతా 68 అభ్యర్థుల నామినేషన్లలో పొరపాట్లు చోటు చేసుకోవడం... కొందరు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లు దృష్టికి రావడంతో తిరస్కరించారు.

తిరస్కరణకు గురైన వాటిలో గాజులరామారం కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్‌ నామినేషన్‌ ఉంది. శ్రీనివాస్‌గౌడ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో ఆయనకు అధికారులు విషయాన్ని తెలిపారు.దాంతో ఆయన సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకోగా, తీవ్ర వాదోపవాదాల అనంతరం నిబంధనల మేరకు శ్రీనివాస్‌గౌడ్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు.

విషయం తెలిసి ఆయన సోదరుడు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాదాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు సరిగ్గా లేకపోవడం, ముగ్గురు పిల్లలు ఉన్నందున రిజెక్ట్‌ చేశారు.ఇక చివరిరోజైన ఆదివారం చాలామంది ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక బరిలో మిగిలేదెవరో తేలనుంది. ఆయా పార్టీలకు రెబెల్స్‌ బెడదపై స్పష్టత రానుంది.

Tags :
|

Advertisement