Advertisement

  • హోరాహోరీగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది...!

హోరాహోరీగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది...!

By: Anji Sun, 29 Nov 2020 8:02 PM

హోరాహోరీగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది...!

పది రోజులుగా హోరాహోరీగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో అప్పటి వరకూ రోడ్ షోలు, ప్రసంగాలు, డప్పు, మైకు చప్పుళ్లతో మార్మోగిన వీధులు మూగబోయాయి.

ఇన్ని రోజులూ ఆయా పార్టీలు అగ్రనాయకులు ప్రచారాలతో హోరెత్తించారు. ఎవరికి వారు తమ హామీలతో ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో వారం రోజులుగా నగరం హోరెత్తిపోయింది.

ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్‌‌కు 48 గంటల ముందు అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజైన ఆదివారం అన్ని రాజకీయ పార్టీలు ర్యాలీలు, ప్రచారాలతో హంగామా చేశాయి.

జంటనగరాల్లో ఎక్కడ చూసినా ప్రచారమే కనిపించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఇక ఆదివారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల అభ్యర్ధులు ఓటర్లకు డబ్బుల పంపిణీ షురూ చేశాయి.

పలు ప్రాంతాల్లో డబ్బు పంచుతున్న కార్యకర్తలను ప్రత్యర్థి అభ్యర్థులకు చెందిన అనుచరులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ బల్దియా ఎన్నికలను ఆయా పార్టీలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ అయితే, విపరీతమైన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోయింది. అధికార పార్టీపై మాటల దాడులు, సున్నితమైన అంశాలను లేవనెత్తి ఓటర్ల మనసు మళ్లించడం వంటి ఎన్నో వ్యూహాలను నేతలు అమలు చేశారు.

ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర స్థాయి ఎన్నికల మాదిరిగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కీలక నేతలు వచ్చి నగరంలో ప్రచారం నిర్వహించారంటే ఆ పార్టీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రచార పర్వం ముగియగా.. ఇక ఓటింగ్, ప్రజా తీర్పు మాత్రమే మిగిలి ఉంది.

Tags :

Advertisement