Advertisement

  • పతాకస్థాయికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి...పోటాపోటీ వ్యూహం

పతాకస్థాయికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి...పోటాపోటీ వ్యూహం

By: chandrasekar Thu, 19 Nov 2020 3:04 PM

పతాకస్థాయికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి...పోటాపోటీ వ్యూహం


జీహెచ్ఎంసీ ఎన్నికల సందడిలో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిని కూడా దాదాపుగా పూర్తి చేశాయి. మరికొన్ని పార్టీలు నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక కసరత్తుతో పాటు ఎన్నికల ప్రచారం, విపక్షాలపై విమర్శలు మొదలుపెట్టాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ప్రచారం కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ తమ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించాలని భావిస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. నేతల ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారంపై కూడా టీఆర్ఎస్, బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో.. ప్రచారం కోసం సోషల్ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రెండు పార్టీలు నిపుణుల సేవలను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం కోసం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం.

యువత, నిరుద్యోగులను బీజేపీ వైపు ఆకర్షించడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సైతం గ్రేటర్‌లో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలని ఆలోచిస్తోంది. గతంలో ప్రశాంతి కిశోర్ టీమ్‌లో పని చేసిన కొందరు ప్రస్తుతం టీఆర్ఎస్‌కు సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు కేంద్రం సాయం చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తక్కువ సమయంలో పూర్తి కానున్న ghmc ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్‌తో పోలిస్తే సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ రావడం.. కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ప్రచారానికి ఉన్న మార్గాలను ఉపయోగించుకోవాల్సిన కాంగ్రెస్.. సోషల్ మీడియా ప్రచారంలో మాత్రం అంతగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags :
|

Advertisement