Advertisement

  • ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్ నైపుణ్యం ఉందన్న గంగూలీ

ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్ నైపుణ్యం ఉందన్న గంగూలీ

By: chandrasekar Mon, 24 Aug 2020 10:34 PM

ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్ నైపుణ్యం ఉందన్న గంగూలీ


ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్‌ నైపుణ్యం ఉందని గంగూలీ ప్రశంసించాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్‌ నైపుణ్యం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అందుకే కెరీర్‌ మొదట్లో అతడిని తాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి, షాట్లు ఆడేందుకు పూర్తి స్పేచ్ఛ ఇచ్చానని దాదా అన్నాడు. కెరీర్‌ మొత్తం ధోనీ టాపార్డర్‌లో ఆడి ఉంటే మరింత గొప్ప ఆటగాడయ్యేవాడని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పాడు. ఆరో స్థానంలో ఆడి ఉంటే సచిన్‌ టెండూల్కర్‌ కూడా అంత గొప్ప ప్లేయర్‌ కాకపోయేవాడేమోనని సౌరవ్‌ అభిప్రాయపడ్డాడు.

మూడో స్థానంలో ఆడే అవకాశం ధోనీకి వైజాగ్‌లో వచ్చింది. అద్భుత శతకం బాదాడు. ఎక్కువ ఓవర్లు ఎదుర్కొనే అవకాశం రావడంతో మంచి స్కోరు చేశాడు. ఆరో స్థానంలోనే బరిలోకి దిగుతూ, ఆడేందుకు సరైన బంతులు మిగిలి ఉండకపోతే టెండూల్కర్‌ కూడా టెండూల్కర్‌ కాకపోయే వాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడితే ఓ మంచి క్రికెటర్‌ తయారు కాడని నేను నమ్ముతా. ధోనీకి అద్భుతమైన సామర్థ్యం ఉంది. ముఖ్యంగా అతడి సిక్స్‌ హిట్టింగ్‌ శక్తి అత్యుత్తమం. అతడు అరుదైన బ్యాట్స్‌మన్‌. టాపార్డర్‌లో ఆడాలని ధోనీకి నేను రిటైరయ్యే ముందు చాలా సార్లు సూచించా అని గంగూలీ చెప్పాడు.

సౌరవ్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో అరంగేట్రం చేసిన ధోనీ 2005లో పాకిస్థాన్‌తో వన్డేలో మూడో స్థానంలో బరిలోకి దిగి 148 పరుగులతో అదరగొట్టాడు. కెరీర్‌లో ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. కాగా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన మహీ ఈనెల 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రానున్న నెలల్లో భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు గంగూలీ చెప్పాడు. దేశవాళీ సీజన్‌ నిర్వహించేందుకు సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నట్టు వెల్లడించాడు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై సభ్యులందరికీ సమాచారం ఇస్తాం. దేశవాళీ సీజన్‌ను ప్రారంభించే ముందు సలహాలు స్వీకరిస్తాం అని గంగూలీ వెల్లడించాడు.

రానున్న సంవత్సరం ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు ఇంగ్లిష్‌ జట్టుతో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడుతుందని వెల్లడించాడు. కరోనా వైరస్‌ వల్ల వాయిదా పడిన సిరీస్‌లను నిర్వహించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు పంపిన ఈమెయిల్‌లో దాదా పేర్కొన్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ఇండియా తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌తో ఆడుతుందని స్పష్టం చేశాడు. మరోవైపు పాకిస్థాన్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ క్రాలీ అద్భుతంగా ఆడుతున్నాడని, త్వరలోనే అతడిని అన్ని ఫార్మాట్లలో చూడాలనుకుంటున్నానని సౌరవ్‌ చెప్పాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ మంచి ఫారంలో వున్నారు మరియు ఇండియాతో మంచి పోటీని ఇవ్వగలరని భావిస్తున్నాను అని తెలిపారు.

Tags :

Advertisement