Advertisement

ధోనీ ఆటని ప్రశంసించిన గంగూలీ

By: chandrasekar Wed, 08 July 2020 5:45 PM

ధోనీ ఆటని ప్రశంసించిన గంగూలీ


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ధోనీలోని పవర్ హిట్టింగ్ స్కిల్స్‌ని తాను ఆరంభంలోనే గుర్తించగలిగానని వెల్లడించాడు. 2004లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ తొలుత మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ ధోనీ బంతిని బలంగా బాదగలడని విశ్వసించిన గంగూలీ పాకిస్థాన్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో నెం.3లో బ్యాటింగ్‌కి పంపాడు. ఆ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ పాక్ బౌలర్లని ఉతికారేసి 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత ధోనీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ధోనీ మంగళవారం 39వ పుట్టినరోజు జరుపుకోగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ఛాట్‌ షోలో మాట్లాడిన గంగూలీ ధోనీ ఆటని ప్రశంసించాడు‘‘ధోనీ టాప్ ఆర్డర్‌లో ఆడాలని ఇప్పటికీ నేను చెప్తుంటాను. ఎందుకంటే అతను ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. అత్యుత్తమ ఆటగాళ్ల లక్షణం ఏంటంటే? ఒత్తిడిలోనూ బౌండరీలు రాబట్టగలరు. ధోనీ అందులో బెస్ట్. అందుకే ధోనీ స్పెషల్ ఆటగాడయ్యాడు. మొత్తంగా భారత క్రికెట్‌లో ధోనీ లాంటి ప్లేయర్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను నమ్మశక్యంకాని ఆటగాడు’’ అని గంగూలీ వెల్లడించాడు.

భారత క్రికెట్‌ ఫిక్సింగ్‌లో కూరుకుపోయిన దశలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ.. టీమిండియాకి దూకుడు నేర్పాడు. ఆ తర్వాత ధోనీ.. భారత జట్టుని మరోస్థాయికి తీసుకెళ్లాడని ఇప్పటికీ మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనీ. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.

Tags :
|
|

Advertisement