Advertisement

సభ్యత్వం పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం

By: chandrasekar Mon, 01 June 2020 10:19 PM

సభ్యత్వం పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం


సమాజ సేవకు మా సంస్థలో సభ్యత్వం తీసుకుంటే నెలనెలా వేతనం వస్తుందని వందలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ముగ్గురిని సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి కథనం ప్రకారం బడీచౌడీకి చెందిన శీలం సరస్వతి ఆర్య మహిళా సంఘం నాయకురాలిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏప్రిల్‌ నెలలో ఆమెకు నిజామాబాద్‌ జిల్లా ఎడుపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన పవన్‌ (28) పరిచయమయ్యాడు. తాను తెలంగాణ సోషల్ సర్వేలో ‌ పని చేస్తున్నానని చెప్పాడు. మీలా సమాజ సేవ చేసే వారు మా సంస్థలో సభ్యత్వం తీసుకుంటే ప్రతినెలా వేతనం మీ బ్యాంక్‌ ఖాతాలో పడుతుందని నమ్మించి సభ్యత్వం కట్టించాడు.

అంతేకాకుండా శీలం సరస్వతికి తెలిసిన పలువురు మహిళలు, ఇతరుల నుంచి కూడా సభ్యత్వాల పేరుతో రూ. 2 వేల నుంచి రూ. 6 వేల వరకు తన స్నేహితులైన లక్ష్మణ్‌ (36), ప్రసాద్‌ (30) బ్యాంక్‌ ఖాతాలకు గూగుల్‌ పే ద్వారా పవన్‌ జమ చేయించుకున్నాడు. ఇలా సుమారు 120 మంది వరకు డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం వారందరితో కలిపి పవన్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. గ్రూపులో కొన్ని రోజుల వరకు సేవా కార్యక్రమాలను పోస్ట్‌ చేయించాడు. నెల గడిచినా ఖాతాలలో వేతనం పడకపోవడంతో వారు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో శీలం సరస్వతి ద్వారా చేరిన వారు ఆమెపై డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినా పవన్‌ అందుబాటులోకి రాకపోగా వాట్సాప్‌ గ్రూప్‌లో అసభ్య చిత్రాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు.

దీంతో మోసపోయామని గుర్తించిన ఆమె ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను శనివారం వారి గ్రామంలో అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌ చేశారు. ప్రధాన నిందితుడు పవన్‌ గతంలో నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి మోసాలకు పాల్పడడంతో అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement