Advertisement

  • భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు.. నలుగురు జవాన్లు వీరమరణం

భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు.. నలుగురు జవాన్లు వీరమరణం

By: chandrasekar Mon, 09 Nov 2020 6:44 PM

భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు.. నలుగురు జవాన్లు వీరమరణం


జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం పొందారు. ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్‌ సెక్టార్‌లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్‌ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్థరాత్రి దాటాక భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదితో పాటు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన కానిస్టేబుల్‌ ఒకరు మరణించారు. సుమారు మూడు గంటలపాటు ఈ కాల్పులు కొనసాగినట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఆదివారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అదే ప్రాంతంలో మళ్లీ చొరబాట్లకు యత్నించడంతో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు ఒక ఆర్మీ అధికారి మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

కోమన్‌పల్లి చెందిన ఆర్మీ జవాన్ మృతి...

ఆదివారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందారు. మహేశ్‌ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్‌ 6వ తరగతి వరకు వేల్పూర్‌ మండలం కుకునూర్‌ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్‌ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్‌ ఉన్నారు. మహేశ్‌ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు. మహేశ్‌ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదంలో మునిగిపోయింది.

Tags :
|

Advertisement