Advertisement

  • మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

By: chandrasekar Mon, 31 Aug 2020 7:14 PM

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత


భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఆగస్ట్ 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స తరువాత ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

రాజకీయ ప్రస్థానం

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి. ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు. కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు. ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

former president,and senior,congress leader,pranab mukherjee,died ,మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ ,సీనియర్, నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ,కన్నుమూత


1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. 2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు. మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు. భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు. ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు.

Tags :

Advertisement