Advertisement

  • మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో వింత అనుభవం

మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో వింత అనుభవం

By: chandrasekar Tue, 06 Oct 2020 1:06 PM

మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో వింత అనుభవం


విదేశాల నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో వింత అనుభవం ఎదురైంది.

అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో వేసిన క్వారెంటైన్‌ స్టాంపులు‌ బొబ్బలు పుట్టించాయి. చేతిపై వాతలు పెట్టినట్లు బొబ్బలు రావడం ఆయనకు ఆందోళన కలిగించింది. అక్టోబర్ 4 న ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ దృష్టికి తీసుకెళ్లారు. క్వారంటైన్ స్టాంపింగ్‌కు వాడిన సిరాలో ఏదైనా లోపం ఉందేమోనని మధుయాస్కీ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. క్వారంటైన్ స్టాంప్ విషయంలో ఆందోళన కలిగిస్తోంది.

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ అమెరికా నుంచి స్వదేశానికి వచ్చారు. శనివారం ఉదయం ఢిల్లీలో విమానం దిగారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భద్రతా సిబ్బంది ఆయన చేతిపై మూడు క్వారెంటైన్‌ స్టాంపులు వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్టాంపులు వేసిన చోట మంట మొదలైనట్లు మధుయాస్కీ గౌడ్ తెలిపారు. అది సాధారణమైందేమో అనుకుని తొలుత కొద్దిసేపు ఓర్చుకున్నట్లు మాజీ ఎంపీ తెలిపారు. అయితే.. మంట ఎంతకీ తగ్గకపోవడంతో చల్లదనం కోసం నీళ్లతో తడిపినట్లు తెలిపారు. ఆ తర్వాత అలాగే మరో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. అప్పటికి బొబ్బలు మరింత ఎక్కువయ్యాయని రాత్రికి రాత్రే వైద్యుడిని సంప్రదించి మందులు వాడానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయానికి మంట కాస్త తగ్గినప్పటికీ బొబ్బలు మాత్రం తగ్గలేదని మధుయాస్కీ గౌడ్ తెలిపారు. స్టాంపింగ్‌కు వాడిన సిరాలో ఏదైనా లోపం ఉందేమోనని తెలిపారు. మధుయాస్కీ ట్వీట్‌కు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ స్పందించారు. ఘటనపై ఎయిర్‌పోర్టు అథారిటీ సీఎండీతో మాట్లాడినట్లు వెల్లడించారు. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.

మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. స్టాంప్ కోసం వినియోగించిన ఇంక్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమైనదే. విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు బదులిచ్చారు. ఆ బ్యాచ్‌ సిరాను పరీక్ష కోసం పంపుతామని, ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టామని ఢిల్లీ జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్టు తెలిపింది. మరోవైపు నాగ్‌పుర్, భువనేశ్వర్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని కొంత మంది ప్రయాణికులు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై నెటిజన్లు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ‘దాన్ని సరఫరా చేసినవారు ప్రయాణికులకు రోగనిరోధక శక్తి తక్కువుందని అంటారేమో’ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

Tags :
|

Advertisement