Advertisement

  • క్వారంటైన్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం

క్వారంటైన్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం

By: chandrasekar Tue, 25 Aug 2020 09:02 AM

క్వారంటైన్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం


కరోనా వైరస్ కు గురై అనారోగ్యంతో చాలా మంది చికిత్స తీసికొంటున్నారు. వీరికి చికిత్స చేయడానికి అనేక చోట్ల ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం విశాఖపట్నం నగర శివారు చిన్నగదిలి మండలంలోని మారికివలస గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌లో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసుల అందించిన వివరాల ప్రకారం ఇటీవల మారికివలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌, మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మూడో అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరోనా రోగులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో మొత్తం 64 మంది కరోనా రోగులు చికిత్స తీసికొంటుండగా ఎవ్వరికి ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ కళాశాలలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు, నార్త్ జోన్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి, కొవిడ్ నోడల్ అధికారి సుబ్బలక్ష్మి పరిశీలించారు. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది.

ఈ ప్రాంతంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్‌కు తరలిస్తున్నారు. అయితే సకాలంలో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఇటీవలే విజయవాడలోని స్వర్ణప్యాలెస్ హోటల్లో రమేష్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. విజయవాడ అగ్ని ప్రమాదం గురించి ఇంకా వివరాలు వెలువడాల్సి వుంది.

Tags :

Advertisement