Advertisement

  • గుహ వ్యాఖ్య‌ల‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ దీటుగా జవాబు

గుహ వ్యాఖ్య‌ల‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ దీటుగా జవాబు

By: chandrasekar Sat, 13 June 2020 12:48 PM

గుహ వ్యాఖ్య‌ల‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ దీటుగా జవాబు


భార‌త‌దేశ ఆర్థికవ్యవస్థ సుర‌క్షితంగానే ఉన్న‌ద‌ని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ట్విటర్ వేదిక‌గా ఇటీవ‌ల ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీలపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. అయితే, గుహ వ్యాఖ్య‌ల‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ దీటుగా జవాబిచ్చారు.

'గుజరాత్‌ ఆర్థికంగా ముందంజలో ఉందేమో కానీ, సాంస్కృతికంగా వెనుకబడి ఉంది. అదేవిధంగా బెంగాల్‌ ఆర్థికంగా వెనుకబడినా సాంస్కృతికంగా సంపన్నమైనది' అని బ్రిటిష్‌ రచయిత ఫిలిప్‌ స్పార్ట్‌ 1939లో రాసిన పంక్తులను రామచంద్ర గుహ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాక ఆ పంక్తులు తన సొంత అభిప్రాయాలు కాదని, పరిశోధనలో భాగంగా తనకు ల‌భించాయ‌ని తెలిపారు. ఈ విషయమై ఎవరైనా పొగిడినా, ఆగ్రహం వ్యక్తం చేసినా అవి ఆ పంక్తులు రాసిన వ్యక్తి ఆత్మకే చెందుతాయ‌ని గుహ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై ఆర్థిమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ స్పందించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మహారాజా జామ్‌ సాహెబ్‌ దిగ్విజయ్‌సింగ్‌జీ జడేజా రెండో ప్రపంచయుద్ధ సమయంలో పోలాండ్‌కు చెందిన‌ వెయ్యి మంది చిన్నారులను రక్షించార‌ని, మ‌హారాజు చేసిన ప‌నిని అదే చరిత్రకారుడు ఫిలిప్‌ స్పార్ట్‌ ప్రశంసించాడ‌ని ఆమె గుర్తుచేశారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా గుహ ట్వీట్‌పై స్పందిస్తూ గతంలో బ్రిటిష్‌ వారు భారత్‌లో విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తే, ప్రస్తుతం కొందరు మేధావులు భారతీయుల్లో విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమ‌ర్శించారు. వారి రియాక్ష‌న్‌ల‌పై స్పందించిన‌ రామ‌చంద్ర‌గుహ విసుగెత్తించే తనలాంటి ఓ చరిత్రకారుడి వ్యాఖ్యలకు గుజరాత్‌ ముఖ్యమంత్రితోపాటు కేంద్ర ఆర్థికమంత్రి కూడా స్పందించారంటే దేశ‌ ఆర్థిక పరిస్థితి సురక్షితంగా ఉన్నట్టే అని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక ప‌రిస్థితి సుర‌క్షితంగా ఉంద‌న్న గుహ వ్యాఖ్య‌ల‌ను అంగీక‌రిస్తూనే కౌంట‌ర్ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉందని, ఆయన చింతించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చరిత్రపట్ల ఆసక్తి, పరిజ్ఞానం తనకున్న అదనపు అర్హతల‌ను రామ‌చంద్ర‌గుహ‌ గమనించాలని నిర్మలా సూచించారు.

Tags :

Advertisement