Advertisement

  • కేంద్ర విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించాలన్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

కేంద్ర విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించాలన్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

By: chandrasekar Wed, 16 Sept 2020 10:32 AM

కేంద్ర విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించాలన్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు


కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజల కోపానికి బీజేపీ గురికాక తప్పదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం రూ.1.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల బోరు బావులకు మీటర్లు పెట్టాలని చెబుతున్నదని, దుబ్బాకలో బీజేపీ ఓటు అడగాలంటే రైతుల బోరు బావుల మీటర్లకై పార్లమెంటులో పెట్టిన బిల్లు ఉపసంహరణ చేసుకోవాలని మంత్రి సూచించారు. దౌల్తాబాద్ ప్రాంత రైతుల మేలు కోసం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంతో ఆలోచన చేశారని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమాతో పాటు ఎన్నో రైతు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేపట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక నియోజకవర్గంలో 20 వేల మంది బీడీ కార్మికులకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నదని, అదే విధంగా 56 వేల 906 మంది అర్హులకు ఆసరా ఫించన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా రైతులకు, పేదలకు సీఎం కేసీఆర్ మరింత దగ్గరయ్యారని మంత్రి వెల్లడించారు. అనంతరం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో రూ.1.10కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి వెంట సర్పంచ్ లు యాదమ్మ, సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, విద్యుత్ శాఖ ఏస్ఈ కరుణాకర్ బాబు, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ, మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బోరు బావులకు మీటర్లు పెట్టడం వల్ల రైతులు మరింతగా ఆర్ధిక ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Tags :

Advertisement