Advertisement

  • కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడంలో భాగంగానే రైతుల సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు

కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడంలో భాగంగానే రైతుల సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు

By: chandrasekar Fri, 04 Dec 2020 8:16 PM

కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడంలో భాగంగానే రైతుల సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్న పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ ఒక్క రోజు భారత్ బంద్ నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ జనరల్ సెక్రటరీ హెచ్‌ఎస్ లోఖోవాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద తమ నిరసన తెలియజేస్తామని... ప్రభుత్వం టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. తమ ఉద్యమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నేతలతో జరిపిన చర్చల్లో వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకొమ్మని తాము స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు.

"నిన్న కేంద్రంతో జరిగిన చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టంగా చెప్పాం. మేము డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నాం. మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే" అని లోఖోవాల్ డిమాండ్ చేశారు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన రైతులు కొద్ది రోజులుగా అక్కడే ఉండి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రైతులతో కేంద్రం చర్చలు ప్రారంభించింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రులు, అధికారులు నాలుగు సార్లు రైతు సంఘం నేతలతో చర్చలు జరిపారు. గురువారం రైతు సంఘాలతో చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఇక, శనివారం రైతు సంఘాల నాయకులు, కేంద్రం మధ్య ఐదో దఫా చర్చలు జరగనున్నాయి. అయితే రేపటి చర్చల సందర్భంగా కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడంలో భాగంగానే రైతుల సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయనే టాక్ వినిపిస్తోంది.

Tags :

Advertisement