Advertisement

ఐదోతరగతి డాక్టర్ ఆటకట్టు

By: Dimple Sat, 12 Sept 2020 09:39 AM

ఐదోతరగతి డాక్టర్ ఆటకట్టు

డాక్టర్‌నంటూ నమ్మబలికాడు.. మంచి డాక్టర్‌గా అందరి ముందు నటించాడు.. అందరితోనూ ప్రశంసలూ పొందాడు.. రాచకొండ పోలీసులకే చికిత్స చేసి భేష్‌ అనిపించుకున్నాడు.. తీరా అతని గుట్టు రట్టు అయ్యే సరికి అందరూ నివ్వెరపోయారు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన వెంకట్‌రావు కుమారుడు తేజ అలియాస్‌ తేజారెడ్డి అలియాస్‌ అవినాష్‌ రెడ్డి అలియాస్‌ వీరగంధం తేజ(23) నగరంలోని బోడుప్పల్‌ వెస్ట్‌ బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. 5వ తరగతితోనే చదువు ఆపేశాడు. తండ్రి వీరగంధం వెంకట్రావ్, మిత్రుడు శ్రీనివాస్‌రావు సహకారంతో తేజ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులను సంపాదించాడు.

అంతేకాకుండా టెన్త్, ఇంటర్‌ ఉత్తీర్ణత పత్రాలను సాధించాడు. భారతీయ శిక్షా పరిషత్‌ లక్నో, ఉత్తర్‌ప్రదేశ్‌ పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ మెమోరియల్‌ హెల్త్, ఆయూష్‌ యూనివర్సిటీ, రాయిచూర్‌ ఛత్తీష్‌ఘడ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ హిమాలయన్‌ యూనివర్సిటీల నుంచి ఎంబీబీఎస్, బీబీఏ, ఎంబీఏ నకిలీ ధృవపత్రాలను సంపాదించాడు. మొదట బెంగుళూరులోని సప్తగిరి ఆస్పత్రిలో జూనియర్‌ డీఎంవోగా పని చేశాడు. అనంతరం ఏఎస్పీ దేవగిరి అంటూ కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో తనిఖీలు చేసి స్థానికంగా సంచలనం సృష్టించాడు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎం.ఎన్‌.రెడ్డి కుమారుడినంటూ అక్కడ పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం చెప్పాడు.

ఈ మేరకు పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక తన మకాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. నగరంలోని అనేక కార్పొరేట్‌ ఆస్పత్రులలో వైద్యుడిగా కొనసాగాడు. ఫిబ్రవరి వరకు వైద్య శిబిరాలను సైతం నిర్వహించాడు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించాడు. రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వలంటీర్‌గా చేరి అక్కడ వారికి చికిత్స చేశాడు. కరోనా బారినపడిన సిబ్బందికి సైతం వైద్యం చేశాడు. సీనియర్‌ పోలీసులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాచకొండ పోలీసులకే మస్కా కొట్టాడు. చికిత్స తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఓ ముఖ్యమంత్రికి బంధువునంటూ అందరినీ మోసం చేశాడు. రూ. 15 లక్షల రుణం ఎగ్గొట్టాడు. గుంటూరుకు చెందిన జయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో డెంటిస్ట్‌ అమృత సౌందర్యను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనికి పోలీసులతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని ఓ రౌడీషీటర్‌పై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తేయిస్తానంటూ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. దీనికి తోడు రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్‌ వేయించుకొని తిరిగాడు. పోలీసులకు అనుమానమొచ్చి ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. నకిలీ వైద్యుడిగా చెలామణి అవుతున్న తేజ, ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), తేజ తండ్రి వీరగంధం వెంకటరావులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రూ. 4.70 లక్షలు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Tags :
|
|

Advertisement