Advertisement

  • కరోనా పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటెల రాజేందర్

కరోనా పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటెల రాజేందర్

By: Sankar Wed, 01 July 2020 09:44 AM

కరోనా పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటెల రాజేందర్



కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినందున చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అవసరమున్న ప్రతి వ్యక్తికి పరీక్షలు చేస్తామని, అందుకోసం 11 కేంద్రాల్లో అనుమానితుల నమూనాలు సేకరిస్తున్నామన్నారు. పరీక్షల కోసం వస్తున్న వారు తప్పక మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.

మంగళవారం మంత్రి తన చాంబర్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారు తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌ కావాలని మంత్రి సూచించారు. ఇలా ఉన్నవారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్‌ సెంటర్‌ నుండి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు.

అవసరం ఉన్న వారి దగ్గరకు డాక్టర్లను పంపించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు వచ్చిన ప్రతి పేషంట్‌ దగ్గరికి డాక్టర్, నర్స్‌ తప్పకుండా రోజుకి మూడుసార్లు వెళ్లి పరీక్ష చేయాలని, పేషంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీలను కరోనా పేషంట్లను చేర్చుకునేందుకు సిద్ధంచేయాలంటూ, ఆ బాధ్యతను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, కరోనా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రవణ్‌కు అప్పగించారు. వాటి సన్నద్ధతపై రోజూ రిపోర్ట్‌ అందజేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), గాంధీ ఆస్పత్రుల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు రూ పొందించాలని సూచించారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సామర్థ్యానికి మించి శాంపిల్స్‌ స్వీకరించడంతో గత వారం పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో పరీక్షలకు విరామం ప్రకటించిన యంత్రాంగం... తిరిగి మంగళవారం పరీక్షల కోసం శాంపిల్స్‌ స్వీకరణను ప్రారంభించింది.

Tags :
|
|
|

Advertisement