Advertisement

  • యెస్‌ బ్యాంక్ రుణాల కుంభకోణంపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్

యెస్‌ బ్యాంక్ రుణాల కుంభకోణంపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్

By: chandrasekar Tue, 09 June 2020 5:38 PM

యెస్‌ బ్యాంక్ రుణాల కుంభకోణంపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్


రుణాల కుంభకోణంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంక్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తుని వేగవంతం చేసింది. దీనిలో భాగంగా గ్లోబల్‌ టూర్స్‌ అంట్‌ ట్రావెల్‌ కంపెనీ ‘కాక్స్‌ అండ్‌ కింగ్స్‌' కార్యాలయాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. ముంబైలో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌కు చెందిన ఐదు కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ప్రమోటర్‌ పీటర్‌ కెర్కర్‌కు మార్చి నెలలోనే నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. యెస్‌ బ్యాంక్‌ నుంచి భారీగా రుణాలు పొందిన కంపెనీల్లో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఒకటని, ఈ సంస్థకు యెస్‌ బ్యాంకు దాదాపు రూ.2,267 కోట్ల రుణాలు ఇచ్చిందని అధికారులు వివరించారు. ఈ కేసులో యెస్‌ బ్యాంక్‌తోపాటు పలు ఇతర బడా కార్పొరేట్‌ గ్రూపులపై కూడా ఈడీ దర్యాప్తు జరుపుతున్నది. యెస్‌ బ్యాంక్‌ ఇచ్చిన పలు పెద్ద రుణాలు మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులుగా మారడమే ఇందుకు కారణం.

యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేయడంతోపాటు ఇటీవల ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో తొలి చార్జిషీటు (అభియోగ పత్రం) దాఖలు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బ్యాంక్‌ మాజీ సీఎండీ రాణా కపూర్‌తోపాటు ఆయన భార్య, కుమార్తెలపై ఇప్పటికే ఈడీ కేసులు నమోదు చేసింది. వీరితోపాటు కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో మోర్గాన్‌ క్రెడిట్స్‌, రాబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, యెస్‌ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చారు.

Tags :

Advertisement