Advertisement

  • ఎన్నికల తేదీలు ప్రకటించాల్సింది, అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది మేమే... మీకేంటి బాధ

ఎన్నికల తేదీలు ప్రకటించాల్సింది, అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది మేమే... మీకేంటి బాధ

By: chandrasekar Fri, 20 Nov 2020 3:33 PM

ఎన్నికల తేదీలు ప్రకటించాల్సింది, అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది మేమే... మీకేంటి బాధ


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సర్కారుకు ఈసారి మరింత సూటిగా, ఘాటుగా స్పందించారు. ‘‘స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేం. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు... సన్నద్ధత గురించి మేమే మీకు చెబుతాం’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని రాసిన లేఖపై గురువారం నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రతిస్పందించారు. ‘‘స్థానిక ఎన్నికలు నిర్వహించేది మేము. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీకి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది’’ అని సూటిగా చెప్పారు. ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రభుత్వం వక్రభాష్యం చెబుతోందని సీఎస్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని మాత్రమే న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. ‘‘ఎన్నికల తేదీలు ప్రకటించాల్సింది, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది మేమే. ఈ విషయంపై మిమ్మల్ని సంప్రదించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప, మీ నిర్ణయంతో మాకు సంబంధం లేదు’’ అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో చూడాలని సీఎస్ కు సూచించారు. ‘‘సుప్రీం తీర్పును అమలు చేయండి. ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పీలుకు వెళ్లండి. అంతే తప్ప... ఎస్‌ఈసీకి సహకరించకపోవడం సరికాదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. తీవ్రమైన క్రిమినల్‌ చర్యగా భావించాల్సి ఉంటుంది’’ అని నిమ్మగడ్డ తెలిపారు.

‘‘రాష్ట్రంలో కరోనా ఇంకా తీవ్రంగానే ఉంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు మేమే చెబుతాం. ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సిన అవసరంలేదు’’ అని సీఎస్‌ పేర్కొనడంపై నిమ్మగడ్డ తీవ్రంగా స్పందించారు. గురువారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకుంటున్నానని సహకరించాలని కోరారు. వారితో మాట్లాడితే ప్రభుత్వానికి వచ్చిన సమస్యేమిటని తన లేఖలో ప్రశ్నించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్నది ఒక ఆలోచన మాత్రమేన్నారు. ‘‘జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లున్నాయో తెలుసుకునేందుకు ప్రాథమిక అవగాహన కోసం జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలనుకున్నాం. మీ సమక్షంలోనే కలెక్టర్లతో మాట్లాడితే అందుకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా! కావాలంటే ఆ సమావేశంలో మీరూ వచ్చి కూర్చోండి’’ అని సాహ్నికి సూటిగా చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థకు సహకరించాల్సిన బాధ్యతను ప్రభుత్వానికి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రులు కూడా ఉద్యోగులను రెచ్చగొట్టేలా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఆక్రోశించారు. ‘‘ఎన్నికలు ఇప్పుటికిప్పుడు నిర్వహిస్తామని చెప్పలేదు. ఫిబ్రవరిలో నెలలో నిర్వహించాలన్నది ఒక ఆలోచన. దానికి మీరు ఇప్పుడే ఆందోళన చెందుతూ కమిషన్‌కు లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వ వైఖరి అన్ని రకాల ఉల్లంఘనల కిందకు వస్తుంది. ఇప్పటికీ మించిపోలేదు. ఎన్నికల కమిషన్‌కు సహకరించండి. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. ఒక్కసారి మీరూ సరిచూసుకోండి’’ అని సీఎ్‌సకు హితవు పలికారు. సీఎస్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో... గురువారం నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ను కూడా నిమ్మగడ్డ రద్దు చేశారు.

Tags :
|

Advertisement