Advertisement

ముగిసిన ప్రచారం ..మిగిలింది ఇక సమరం

By: Sankar Sun, 01 Nov 2020 7:52 PM

ముగిసిన ప్రచారం ..మిగిలింది ఇక సమరం


దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార రణరంగం ముగిసింది. ఓటర్ల తీర్పు మాత్రమే మిగిలివుంది. చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం సాయంత్రం అయిదు గంటలతో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు జోరుగా సాగిన ప్రచారం, నాయకుల ఉపన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులు, మైక్ శబ్దాలు, అభ్యర్థుల హామీలు, వాగ్దానాలు మాటల తూటాల ప్రచార పర్వం ముగిసింది . జోరు వాన కురిసి వెలిసినట్లు పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో సమాప్తం అయింది.

లక్షా 98 వేల ఓటర్లు ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తాము గెలుస్తామని ఒకరు, తామే గెలుస్తామని మరొకరు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు.

తమని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరిగెత్తిస్తామని అధికార టీఆర్‌ఎస్‌, తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేస్తామని బీజేపీ, తమకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని కాంగ్రెస్, ఇలా ఎవరికి వారే ప్రచారం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను కలియతిరిగారు.

Tags :

Advertisement