Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ భూకంపం ..రిక్టర్ స్కేలుపై 3 తీవ్రత

తెలంగాణాలో మళ్ళీ భూకంపం ..రిక్టర్ స్కేలుపై 3 తీవ్రత

By: Sankar Tue, 23 June 2020 6:21 PM

తెలంగాణాలో మళ్ళీ భూకంపం  ..రిక్టర్ స్కేలుపై 3 తీవ్రత



కరోనా మహమ్మారి విజృంభణతో ఆందోళనకు గురవుతున్న భారత్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీని కొంత కాలంగా భూకంపాలు వణికిస్తున్నాయి. హర్యాణా, జమ్మూ కశ్మీర్‌లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గుజరాత్‌లోనూ 24 గంటల్లో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి కంపించింది.ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నాలుగుసార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనలతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైనట్లు తహశీల్దార్ కమలాకర్ వెల్లడించారు.

చింతలపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తహశీల్దార్ కమలాకర్ తెలిపారు. అటు ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోనూ భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అవి భూప్రకంపనలు కావని తెలిసింది. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాలలో కోటిలింగ క్షేత్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం భూమి నుంచి శబ్దాలు వచ్చాయి. స్థానికులు వీటిని భూ ప్రకంపనలుగా భావించి ఆందోళనకు గురయ్యారు. అనంతరం భూమి నుంచి శబ్దాలు వస్తున్నట్లు గ్రహించారు.

Tags :

Advertisement