Advertisement

  • దుబ్బాక ఎలక్షన్స్ : పార్టీల మధ్య మాటల తూటాలు... వస్తువుల సీజ్...!

దుబ్బాక ఎలక్షన్స్ : పార్టీల మధ్య మాటల తూటాలు... వస్తువుల సీజ్...!

By: Anji Sat, 10 Oct 2020 10:19 AM

దుబ్బాక ఎలక్షన్స్ : పార్టీల మధ్య మాటల తూటాలు... వస్తువుల సీజ్...!

దుబ్బాక ఉప ఎన్నికల్లో రాజకీయం మరింత హీటెక్కింది. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్‌, అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు ఇక్కడే మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నామినేషన్లు కూడా మొదలవడంతో ప్రలోభాలు పర్వానికి తెరలేచింది. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది.

అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వెంకట నరసింహా రెడ్డి, మనోహర్ లు మంత్రి హరీష్ రావు సమక్షంలో కారెక్కారు.

కాంగ్రెస్ నేతలు ఎన్నికలప్పుడే దుబ్బాక వస్తారని మళ్లీ ఎవరు పట్టించుకోరని విమర్శించారు మంత్రి హరీష్‌. ఇక కాంగ్రెస్ నేతలు సైతం మండలాల వారీగా తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దుబ్బాక అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలోనే ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని అన్నారు సీఎల్పీ నేత భట్టి, ఆ తర్వాత అభివృద్ధి ఏమీ కనిపించడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఇప్పటికే ప్రతి గ్రామాన్ని ఒక్కసారి చుట్టి వచ్చారు. ఎన్నికల ఇంచార్జ్ జితేందర్రెడ్డి ఎప్పటికప్పుడు ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి అని అన్నారాయన. మరోవైపు దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రలోభ పర్వం మొదలైంది. నియోజవకర్గంలో బీజేపీ నేతలు... మహిళలకు పంచేందుకు సిద్ధం చేసిన చీరలను ఈసీ పట్టుకుంది. బీజేపీ జిల్లా కార్యదర్శి అంబేటీ బాలేష్‌గౌడ్‌ ఇంట్లో 115 చీరలు, 42 ప్యాంటు, షర్టు పీసులను సీజ్‌ చేశారు అధికారులు.

బీజేపీ నేతలు చీరలు పంపిణీ చేస్తున్నట్టు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల నేతల ప్రచారంతో హిట్ పెరిగింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తమకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. ఎక్కడికక్కడ సభలు సమావేశాలతో కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాయి.

Tags :

Advertisement